భరోసా సెంటర్ ప్రారంభం

బాధిత మహిళలు, బాలలు అధైర్య పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు, దీనిలో భాగంగానే కామారెడ్డిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని జిల్లా ఎస్పీ సి.హెచ్.సింధు శర్మ తెలిపారు.

Update: 2024-02-16 08:35 GMT

దిశ, కామారెడ్డి : బాధిత మహిళలు, బాలలు అధైర్య పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు, దీనిలో భాగంగానే కామారెడ్డిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని జిల్లా ఎస్పీ సి.హెచ్.సింధు శర్మ తెలిపారు. భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపములో గల గ్రీన్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటుందన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు, ఆసుపత్రులు, పోలీసు స్టేషన్ లకు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్య, న్యాయ సలహా,

    కౌన్సెలింగ్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తరువాత నుండి విచారణ పూర్తయి కోర్ట్ లో చార్జిషీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. మోసపోయిన బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని పెంచి మళ్లీ వంచనకు గురికాకుండా చూడటం, తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో ఇవి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు.

     ఫోక్సో, క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ కు సంబంధించిన కేసులలో బాధితులకు సత్వర న్యాయం చేయడం కోసం భరోభా సెంటర్ కి బదిలీ చేయడం ద్వారా మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సెలింగ్ ఇప్పించడం, బాధితురాలి స్టేట్మెంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి పునరావాసం ఇవ్వటం వంటి పనులు జరుగుతున్నాయన్నారు. బాధితులు నిర్భయంగా ఉండవచ్చని సూచించారు. భరోసా ద్వారా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ భరోసా సెంటర్లో సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ పర్సన్, ఏఎన్ ఎంతో పాటు రిసెప్షనిస్టు సేవలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News