లక్ష్మి కాలువలు అధ్వానం.. వేసవిలో చర్యలు శూన్యం

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి పై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు రైతులు.

Update: 2024-06-26 13:11 GMT

దిశ, మోర్తాడ్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి పై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు రైతులు. శ్రీరామ్ సాగర్ ప్రాజేక్ట్ నుంచి లక్ష్మీ కాలువ ద్వారా స్థానిక నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్ మండలాల్లోని రైతులకు సాగునీటి కోసం విడుదల చేసే లక్ష్మీ కాలువ నీరు పంట క్షేత్రాలకు చేరటం ఇబ్బందిగా ఉందని తెలపడంలో అతిశయోక్తి లేదు. ప్రధాన కాలువ, ఉప కాల్వలలో పొదలు పెరిగి పోవడం, ప్రధాన కాలువ లైనింగ్, ఉప కాలువ లైనింగ్ అక్కడక్కడ ధ్వంసం కావడం కొన్ని చోట్ల కట్టలు ధ్వంసం కావడంతో నీటి ప్రవాహానికి అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. సాగునీరు అందించే లక్ష్మి కాలువ, ఉపకాలువల లైనింగ్ అధ్వాన్నంగా మారింది.

అధ్వాన్నంగా లక్ష్మీ కాలువ, ఉపకాలువలు..

లక్ష్మీ కాలువ బాల్కొండ నియోజకవర్గంలో 3.5 కిలోమీటర్లు దూరం పొడవు ఉంది. బాల్కొండ ముప్కల్ మోర్తాడ్ మండలాలకు నీరు అందిస్తుంది. ఈ కాల్వ కింద 63 చెరువులు నింపుతారు. ఈ కాలువ కింద సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం కోసం నీటి విడుదల జరుగుతుంది. లక్ష్మీ కాల్వ లైనింగ్ ఇరుపక్కల ప్రధాన కాలువ చాలాచోట్ల సిమెంట్ లైనింగ్ ఊడిపోవడం, కాలువల్లో ముండ్ల పొదలు, పిచ్చి మొక్కలు, అక్కడక్కడ లైనింగ్ మట్టి కొట్టుకుపోవడం. చెత్త చెదారం చేరడం వాటిని శుభ్రం చేయకపోవడంతో నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జులై 1న తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు..

గతంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం జులై 1వ తేదీన బాబ్లీ గేట్లు తెరవడంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిస్తే ప్రాజెక్టులు నిండిపోయి అక్కడ నుంచి వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ కు ఉన్న కాలువల ద్వారా నీటి విడుదల చేస్తారు. కానీ ఈ ఎండకాలంలో కేవలం గేట్ల మరమ్మత్తుకు అధికారులు పరిమితమయ్యారు. కానీ శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన లక్ష్మి కాలువ, దాని ఉపకాలువల మరమ్మత్తులు చేపట్టలేదు. ఎస్ఆర్ఎస్పీలో నీరు వచ్చిన రైతులకు నీరందించే కాలువలకు బుంగలు పడే ప్రమాదం లేకపోలేదు.

ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు.. శేఖర్ ఏఈ

లక్ష్మీ కాల్వ ద్వారా నీటి విడుదల చేసే సమయానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల మరమ్మత్తులు చేయిస్తున్నాం. త్వరలో పనులను పర్యవేక్షిస్తాము.

Similar News