ప్రమాదంతో పోటీపడుతున్న శ్రామికులు..
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల ప్రధానమైన 63వ నంబర్ జాతీయ రహదారి పై పలురకాల పండ్ల అమ్మకం దారులు ప్రమాదంతో జీవనోపాధిని పొందుతున్నారు.
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల ప్రధానమైన 63వ నంబర్ జాతీయ రహదారి పై పలురకాల పండ్ల అమ్మకం దారులు ప్రమాదంతో జీవనోపాధిని పొందుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని విజయరూరల్ ఇంజనీరింగ్ కళాశాల, నిజాంసాగర్ కెనాల్ దాటిన తర్వాత జాతీయ రహదారి పై మూలమలుపులు కలిగిన స్థలంలో బతుకులు వెళ్ళదీస్తూ పండ్లను అమ్ముకుంటూ ప్రతినిత్యం ప్రమాదంతో పోటీపడుతూ శ్రామికులు ఉపాధిని పొందుతున్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ ప్రధాన జాతీయ రహదారి పై ఎన్నోసార్లు పలువిధాలైన రోడ్డు ప్రమాదాలు కోకొల్లలుగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పై పెచ్చు ఈ ఏడాది మొదట్లో ఆర్మూర్ కు చెందిన భూసం ప్రతాప్ రోడ్డు ప్రమాదం జరిగి ఇదే రోడ్డులో మరణించిన విషయం విధితమే.
ఈ తరహా రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారి పై లెక్కలేనన్ని సార్లు జరిగాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామముఖద్వారం బోర్డు నుండి, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల వరకు గల ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద రోడ్డు ప్రక్కనే పలురకాల పండ్లను అమ్ముకుంటూ ఎందరో శ్రామికులు జీవనోపాధి పోరాటం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కూడా అనునిత్యం వందలాది సంఖ్యల్లో వాహనాలు వెళుతూ వస్తూ ఉంటాయి. ఇందూరుకు చెందిన, సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిలు పలు సందర్భాల్లో ఈ జాతీయ రహదారి వెంబట వెళ్లి ఉంటారు. అనునిత్యం రోడ్ల పక్కన పండ్లను అమ్ముకుంటూ జీవనోపాధిని పొందుతున్న ఈ శ్రామికుల తిప్పలు ఆ నేతలకు తెలియంది కాదని ఇందూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇందూరు జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లే 44వ జాతీయ రహదారి వెంబడి టోల్ ప్లాజా వద్ద పండ్లు తినుబండారాల అమ్మకాలు చేసుకొని ఉపాధి పొందే శ్రామికుల తిప్పలు తీర్చి టోల్ ప్లాజా సమీపంలో పండ్ల అమ్మకం కోసం ప్రత్యేకంగా మార్కెట్ షెడ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. అదే తరహాలో నిత్యం ప్రమాదంతో పోటీపడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి పై ప్రధాన మూలమలుపుల వద్ద రోడ్డు ప్రక్క భాగంలో పలురకాల పండ్లను అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్న శ్రామికుల బాధలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలోని పాలకులు ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..? అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నట్లు వినబడుతుంది.