కామారెడ్డిలో ముఖ్య నేతల సైలెంట్.. డైలామాలో బీఆర్ఎస్ శ్రేణులు

అధికారం, బలం బలగంతో నియోజకవర్గంలో నెల రోజుల క్రితం

Update: 2024-01-01 12:29 GMT

దిశ,భిక్కనూరు : అధికారం, బలం బలగంతో నియోజకవర్గంలో నెల రోజుల క్రితం వరకు హంగు ఆర్భాటాలతో వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ, సీన్ కట్ చేస్తే, ప్రస్తుతానికి ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ రిజల్ట్స్ వెలువడడం, ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, అన్నింటికంటే ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఓడిపోవడంతో నియోజకవర్గంలోని ముఖ్య నేతలు సైలెంట్ కావడం, మండలాల్లోని పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు నియోజకవర్గస్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేస్తారని అందరూ భావించినప్పటికీ, నేటి వరకు కూడా పార్టీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేయకపోవడం తో చాలామంది నా రాజ్ గా ఉన్నారు. కనీసం సమావేశం ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జరగబోయే సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధమైన ఎజెండాతో ముందుకు వెళ్దామని దిశా నిర్దేశం చేయాల్సిన అధిష్టానం, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోకపోవడం వెనక కేసీఆర్ ఓటమే ప్రధాన కారణమని చర్చ నడుస్తోంది.

ఎక్కడ పోటీ చేసినా ఓటమిని ఎరుగని కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేసి ఓడిపోవడం పట్ల ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని, అందువల్లే నియోజకవర్గ పార్టీ బీ ఆర్ఎస్ పార్టీని పట్టించుకోవడం లేదని ఆ పార్టీ శ్రేణుల్లో గుసగుస వినిపిస్తోంది. కేసీఆర్ ఓటమికి కారణం ఏదైనా...? కారకులు ఎవరైనా, పార్టీ అధిష్టానం వారిని గుర్తించి, దిద్దుబాటు చర్యలకు దిగాల్సిన అధిష్టానం అధికారం కోల్పోయి నెల రోజుల సమయం దగ్గర పడుతున్న ఉలుకు పలుకు లేకపోవడం పార్టీ శ్రేణులను కొందర్ని ఆందోళనకు గురి చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జిల్లా హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సైతం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కలిగిన పార్టీగా గుర్తింపు పొందిన బీ ఆర్ఎస్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు చర్చించుకుంటూ పార్టీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు.

పార్టీ మారేందుకు సిద్ధమైన నేతలు..

పార్టీ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం, పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేర్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో చేరికలకు బ్రేక్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొద్ది రోజులు వేచి చూసి బీజేపీలో చేరేందుకు కూడా మరి కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

Similar News