'బీజేపీది రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేసే పద్ధతి'
భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని, భయపడే తత్వం తెలంగాణ ప్రజల్లో లేదని, నిలబడి కొట్లాడుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని, భయపడే తత్వం తెలంగాణ ప్రజల్లో లేదని, నిలబడి కొట్లాడుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) అన్నారు. రాజకీయంగా బలంగా ఎదిగిన పార్టీ నాయకులను గద్దల్లాగా ఎత్తుకు పోవాలన్న ఆలోచన తప్ప బీజేపీకి ఇంకోటి ఏమీ లేదని స్పష్టం చేశారు. రాముడి పేరు చెప్పాలి రౌడీయిజం చేయాలి అన్నది బీజేపీ పద్ధతి అని మండిపడ్డారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అసలు బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఏం పని? 'రామ్ రామ్ జాప్న.. పరాయి లీడర్ ఆప్నా' అనేదే బీజేపీ పని, ఆ పార్టీకి ఒక నాయకుడు లేడు, ఒక సిద్ధాంతం లేదు, వాళ్లు అసలు ప్రజలలో లేరు అన్నారు. వాళ్లలో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి నాయకులు లేరు.
పోటీ చేసినా వాళ్లు ఎన్నికల్లో గెలువరని భావించి కాంగ్రెసు, టీఆర్ఎస్ వంటి పార్టీల్లో పెద్ద లీడర్లపై కేసులు పెట్టి, ఐటీ దాడులు చేయించి ప్రలోభావాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారు. దేన్ని ఉసిగొలిపిన తెలంగాణ ప్రజలు భయపడే వాళ్ళు కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎవరినీ వదిలిపెట్టకుండా మన దగ్గర గత నెల రోజులుగా ఐటి దాడులను చేస్తున్నారు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారు. అధికారులు వివరాలు అడిగితే పత్రాలు ఇస్తాం చూసుకోండి అంతేగాని దాంట్లో భయపెట్టేదేముంది ? ప్రచారం చేసుకోవడానికి ఏముంది? ఎందుకోసం ఇట్ల చేస్తున్నారు ?" అని నిలదీశారు. మన ఎమ్మెల్యేలను కొలుగోలు చేయడానికి వచ్చిన వాళ్లు బీజేపీ జాతీయ అగ్రనేత బీఎల్ సంతోష్ పేరు ప్రస్తావించారన్నారు.
ఆయనను విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలుస్తే రావడం లేదని, ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. "మన దగ్గర దొరికిన దొంగలను విచారణ చేయవద్దట. యాదగిరిగుట్టలో బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారని ఎద్దేవా చేశారు. నిన్న ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో నాకు అర్థం కాలేదు. దొరికిన దొంగను అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్తే విచారణకు రావాల్సిందేనని బీఎల్ సంతోష్ కి కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన విచారణకు హాజరుకావడం లేదు. టీఆర్ఎస్ మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ వాళ్లు పిలిస్తే వెళ్తున్నారని కానీ బిఎల్ సంతోష్ ఎందుకు రావడం లేదు అన్నది ప్రజలు ఆలోచించాలి" అని కవిత కోరారు. దొంగ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. కానీ ఆ 2000 మొత్తం మోడీ ఇస్తున్నట్లు ఆ వాట్సాప్ లో బిజెపి ప్రచారం చేస్తున్నదని, అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో రాహుల్ గాంధి ఎందుకు పాదయాత్ర చేశారో ఆయనకే తెల్వదు....
రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా తెలంగాణకు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని, తెలంగాణకు ఏం చేస్తారో కూడా చెప్పలేదని అన్నారు. దక్షిణ తెలంగాణలో మునుగోడులో ఉపఎన్నిక జరుగుతుంటే ఆయన ఉత్తర తెలంగాణ మీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవన్నీ ఉత్తర కుమార మాటలేనని, కాబట్టి కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ఎప్పటికీ గులాబీ కండువాకు కంచుకోటగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ యువకులకే 95% ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించాలని కేంద్రానికి ప్రతిపాదించామని, ఆ తర్వాత రాజకీయ చరిత్ర వల్ల అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. దాంతో 96 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ ఏ పని కూడా మీద ఉట్టి ఉట్టిగా చేయరని, పకడ్బందీగా చేస్తారని చెప్పారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని 100 సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారని, కానీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదని గిరిజనులకు గౌరవం కూడా ఇవ్వలేదని కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అందుకోసం జిల్లాకు రూ. 10 లక్షల చొప్పున అందిస్తోందని వివరించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుని మోదీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం పెంచకున్నా సరే సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అన్నారు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ 10 శాతం రిజర్వేషన్ తోని గిరిజనులకు కలిగే లాభం గురించి తండాల్లోకి వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేంధర్, జహిరాబాద్ ఎంపి బిబి పాటిల్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.