చెరువులో దూకి జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య

వేతనాలు సరిగా రావడం లేదన్న మనస్థాపానికి గురై రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-01-16 12:16 GMT

దిశ, భిక్కనూరు : వేతనాలు సరిగా రావడం లేదన్న మనస్థాపానికి గురై రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మర్కంటి శ్రీకాంత్ (25) బీబీపేట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. యధావిధిగా డ్యూటీకి వెళ్లిన శ్రీకాంత్ బీబీపేట పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడే తన తండ్రి కి ఫోన్ చేసి తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ చేసి చెప్పాడు.

    దీంతో తండ్రి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవద్దని నచ్చజెప్పి, ఎక్కడ ఉన్నావని అడగగా చెరువు వద్ద ఉన్నానని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. ఈలోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెంట తెచ్చుకున్న బ్యాగును, చెప్పులను బైక్ వద్ద విడిచిపెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈత గాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెతికించి,

     బయటకు తీయించారు. కాగా గత సంవత్సరం నవంబర్ 8న మృతుని అన్న ఆత్మహత్య చేసుకొని మరణించాడు. పెద్ద కొడుకు పోయాడన్న దుఃఖం నుంచి కోలుకోకముందే చిన్న కుమారుడు శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతనికి తండ్రి శంకరయ్య, తల్లి నాగరాణి ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. 


Similar News