మూడు కోట్ల ప్రాపర్టీ పై మొదలైన జంగ్..

గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం చాలా ఏళ్ళ క్రితం 10 గుంటల భూమిని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కొనుగోలు చేసింది.

Update: 2024-09-08 13:31 GMT

దిశ, భిక్కనూరు : గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం చాలా ఏళ్ళ క్రితం 10 గుంటల భూమిని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ధర విపరీతంగా పెరిగిపోవడంతో గత వారం రోజుల క్రితం అంతర్గతంగా మొదలైన ఇష్యూ, బట్టబయలు కావడం, రాజకీయ రంగును పులుముకుంది. దీంతో మూడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ విషయమై జంగ్ మొదలైంది. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే ఆపోజిట్ దారిలో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల క్రితం హోటల్ యజమాని బాబు బాయ్ వద్ద 10 గుంటల భూమిని చందాలు పోగు చేసి కొనుగోలు చేశారు. హైవే పక్కన పాడుబడిన ప్రాంతంగా ఉండడంతో ఆ స్థలం పై పెద్దగా ఎవరు అప్పట్లో దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆ స్థలం సమీపంలో పెట్రోల్ బంకు పడుతుండడం, ఆ పక్కన చర్చి ఉండడం, ఈ స్థలం సమీపంలో రైతువేదిక ఉండడం, పాత హైవేతో పాటు, కొత్త హైవేకు ఆనుకొని ఉండడంతో ఆ ప్రాపర్టీ విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు పలుకుతుందని రాజకీయ నాయకుల అంచనా.

గత వారం పది రోజుల క్రితం ఈ స్థలం కొనుగోలు చేసిన యజమాని సిమెంటు పలకలు వేసి బౌండరీ చేసేందుకు జేసీబీని తెచ్చి క్లీన్ చేయించడం మొదలుపెట్టడంతో వివాదం మొదలైంది. కొనుగోలు చేసిన ప్రాపర్టీ 10 గుంటల దస్త్రాలకు సంబంధించి ఫైల్ ను అప్పట్లో వీడీసీ పెద్దలు గ్రామపంచాయతీలో ఉంచారు. గ్రామపంచాయతీ భవన పునర్నిర్మాణం సమయంలో ఫైళ్లన్నింటిని బట్టలలో ముల్లెలు కట్టి సమీపంలోని క్లబ్ లోకి తీసుకెళ్లి పెట్టారు. అదే సమయంలో సదరు స్థలానికి సంబంధించిన ఫైల్ మిస్ అయిందన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ స్థలానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉండవన్న ఉద్దేశంతో, ప్లాన్ ప్రకారం ఇద్దరు ముగ్గురు ఖద్దర్ నేతలు కలసి, వారికి అనుకూలమైన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఆ స్థలం ముమ్మాటికి వీడీసీదే...

కొత్తగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు పక్కన ఉన్న 10 గుంటల స్థలం ముమ్మాటికి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ దేనని మాజీ వైస్ ఎంపీపీ తాటిపాముల లింబాద్రి, భిక్కనూరు తాజా మాజీ సర్పంచ్ తునికి వేణు అన్నారు. ఆదివారం స్థానిక యూత్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం గెస్ట్ హౌస్ నిర్మించాలన్న ఉద్దేశంతో కంట్రోల్ షాపుల ద్వారా ఇచ్చే చక్కెర పై కిలోకు రూపాయి, అర్ధకిలో ఇస్తే ఆటన చొప్పున అదనంగా అన్ని కుల సంఘాల ద్వారా డబ్బులు తీసుకొని 1019 సర్వే నెంబర్ లో, కిరాణా అసోసియేషన్ స్థలం పక్కన స్థలం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాని ఇప్పుడు బయటపడుతున్న విషయం ఏమిటంటే ఆ స్థలం సుదర్శన్ సేటు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోందన్నారు. అది పక్కా ప్రైవేట్ ల్యాండ్ అని, ప్రభుత్వ స్థలం అసలే కాదని, 10 గుంటల స్థలం మాత్రం వీడిసిదేనని, ఆ స్థలాన్ని ఎవరు ఆక్రమించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, కేవీ సుబ్బారావు, అందె దయాకర్ రెడ్డి, పి మహిపాల్ రెడ్డి, అంబల్ల మల్లేశం,దుంపల మోహన్ రెడ్డి, సరస్వతి ప్రభాకర్, నర్ముల రామచంద్రం, పొట్టి గిని లక్ష్మణ్, ఉప్పరి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

2017 లోనే కొనుగోలు చేశా..

16 గుంటల స్థలాన్ని 2017 లోనే కొనుగోలు చేశానని వ్యాపారస్తుడు సుదర్శన్ సేటు  తెలిపారు. ఆదివారం నాడు ఆయనను" దిశ" ఈ విషయమై వివరణ కోరగా, చింత శంకర్ నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వివరించారు.


Similar News