IPL 2025 : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ ఆట.. బెట్టింగ్ రాయుళ్లకు కాసుల పంట
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కావడంతో మళ్లీ

దిశ,తాడ్వాయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కావడంతో మళ్లీ బెట్టింగ్ రాయుళ్లు పట్టణం,పల్లె అనే తేడా లేకుండా యువతను సంప్రదిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈసారి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఎక్కడా నేరుగా డబ్బు మార్పిడి లేకుండా జాగ్రత్త పడుతు ఆన్‌లైన్,మొబైల్ ఫోన్‌లలోనే వ్యవహారం సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.జిల్లావ్యాప్తంగా రోజుకి మినిమం రూ, 10 వేల నుంచి రూ.లక్షలతో పందెం కాసేందుకు ఆత్రుతగా ఉన్నట్లు సమాచారం.
కోడ్ భాషతో ఉపయోగిస్తూ...
బెట్టింగ్‌కు పాల్పడే వారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు.కోడ్‌ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు.వారు గెలిస్తే దానికి సంబంధించిన డబ్బును ఎలా ఇవ్వాలో ముందే మాట్లాడుకుంటారు.ఎక్కువగా ఆన్‌లైన్, సెల్ ఫోన్‌ల ద్వారా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదల్చుకున్నారో వారితో ఆన్‌లైన్, సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు
మ్యాచ్ టాస్ వేసిన మొదలు బంతి బంతికీ పందెం..
గతంలో క్రికెట్ బెట్టింగ్ గెలుపోటములపై ఎక్కువగా నడిచేది.కానీ ఇప్పుడు ఆటలో టాస్ నుంచి మొదలుకొని బంతి బంతికీ ఒక రేటు ఉంటుంది.ఈ బంతి బౌండరీ దాటుతుందని,సిక్స్ కొడుతాడని ఫలానా ఆటగాడు ఇంత స్కోర్ చేస్తాడని,బౌలర్ వికెట్ తీస్తాడని ఇలా రకరకాలుగా పందేలు కాస్తుంటారు.అందుకు సంబంధించి టీవీ ముందు కూర్చుని బంతి బంతికి బెట్టింగ్ కస్తూ రేటింగ్ సైతం ముందే మాట్లాడుకుని ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది.చెప్పినట్టు జరిగితే అతను వేసిన పందెంపై మూడు రెట్లు అదనంగా వస్తుంది.ఏజెంట్ల ద్వారా జరిగే బెట్టింగ్‌లు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి.ఇందులో బెట్టింగ్ కాసిన వ్యక్తి గెలిస్తే అతనికి రెండు రెట్లు అదనంగా చెల్లిస్తారు.
బెట్టింగ్ ఎలా నిర్వహిస్తారంటే...
ఈ ఐపీఎల్ మ్యాచ్ జరిగే వాటిలో బెట్టింగ్ రకరకాలుగా జరుగుతున్నది.కొంత మంది గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొంత మంది మధ్యవర్తి సాయంతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.మ్యాచ్ అయిపోగానే వారివారి బెట్టింగ్‌లలో ఎవరికీ ఎవరు ఎంత ఇవ్వాలో చివరికి లెక్క చూసుకుంటున్నారు.
ఎక్కువగా యువతే బానిస..
క్రికెట్ బెట్టింగ్‌కు ఎక్కువ యువకులు బానిసవుతున్నారు.స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండడంతో ఈ ఉచ్చులో చిక్కుకుని బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.కూలినాలి చేసుకునే వారు సైతం అత్యాశతో ఈ ఊబిలోకి దిగి ఆర్థికంగా చితికి పోతున్నారు.గతంలో అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి బెట్టింగ్‌ను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.