ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

ఫిబ్రవరి లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.

Update: 2024-01-25 10:22 GMT

దిశ, కామారెడ్డి : ఫిబ్రవరి లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 7650, ఒకేషనల్ విద్యార్థులు 1500 మంది, ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 8034 కాగా ఒకేషనల్ విద్యార్థులు 1110 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.

    ఫిబ్రవరి 1 నుండి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్స్ లలో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయన్నారు. 16న ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, 19న ఎన్విరాన్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు. అదేవిధంగా థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 14 వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద లలో 50 కేంద్రాల్లో నిర్వహించనున్నామని తెలిపారు.

    విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష సమయానుకూలంగా బస్సులు నడపాలని, విద్యుత్ లో అంతరాయం కలగకుండా చూడాలని, పరీక్ష పత్రాలు, జవాబు పత్రాల రవాణాలో పొలీసు భద్రత కల్పించాలని, ప్రథమ చికిత్సకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి షేక్ సలాం తదితర అధికారులు పాల్గొన్నారు. 


Similar News