ఐఐటీలో ఇంటర్ షిప్ అవకాశం కల్పిస్తాం

పరిశోధనల పట్ల ఆసక్తిగల విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్​లో ఇంటర్ షిప్ అవకాశం కల్పిస్తామని భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

Update: 2024-03-02 14:12 GMT

దిశ, భిక్కనూరు : పరిశోధనల పట్ల ఆసక్తిగల విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్​లో ఇంటర్ షిప్ అవకాశం కల్పిస్తామని భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీ టీఎస్ చౌరస్తా లో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పరిశోధనల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన సీవీ రామన్ లాగా ప్రతి విద్యార్థి ఆలోచనలు చేయాలని, అప్పుడే వారు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా, సైన్స్ విద్యార్థులుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు.

    హైదరాబాద్ లోని ఐఐటీ లో మానవ మెదడుకు, సరిపడే మెమొరీ పరికరాలను తయారు చేసేందుకు పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పారు. పరిశోధనల వైపు దృష్టి పెట్టాలనుకునే విద్యార్థులు మేధస్సును పెంచుకోవాలన్నారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా, పాజిటివ్ గా ఆలోచిస్తే విజయానికి మార్గం సుగమమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను ఈ స్థాయికి ఎదగానడానికి, మంచి ఆలోచనలు కలిగిన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, మన ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే వ్యక్తులతో స్నేహం చేయడం వలన మన ఎదుగుదలకు అవి ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    పరిశోధన పట్ల ఆసక్తి గల విద్యార్థులకు ఇంటర్ షిప్ అవకాశం కల్పిస్తామని ప్రకటించడం పట్ల క్యాంపస్ అధ్యాపక బృందం ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, ఫిజిక్స్ విభాగం హెడ్ డాక్టర్ హరిత లక్కరాజు, ఫిజిక్స్ బి ఓ ఎస్ డాక్టర్ లలిత, డాక్టర్ మోహన్ బాబు, కెమిస్ట్రీ హెడ్ నాగరాజు, అధ్యాపకులు వైశాలి, పిట్ల సరిత, దిలీప్, శ్రీమాత, హాస్టల్ వార్డెన్ డాక్టర్ యాలాద్రి, శ్రీనివాస్, కనకయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News