పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
అనునిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రతా, సంక్షేమానికి ఎనలేని ప్రాధ్యాన్యం ఇవ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వావా సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అనునిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రతా, సంక్షేమానికి ఎనలేని ప్రాధ్యాన్యం ఇవ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వావా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆయన ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశమై పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి కమిషన్ సభ్యుడు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా మాన్యువల్ స్కావెంజర్స్ లేరని, 1993 నిషేధ చట్టం పకడ్బందీగా అమలవుతోందని కలెక్టర్ తెలిపారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను వినియోగించుకుంటున్నట్టు తెలిపారు.
జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు, 530 గ్రామపంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటి చెత్తను సేకరించి, వాహనాల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారని వివరించారు. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వారి పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్య కోసం రూ.20 లక్షల వరకు ఆర్థిక చేయూతను ప్రభుత్వం తరపున సమకూరుస్తున్నామని తెలిపారు. కాగా సఫాయి కర్మచారులకు సంబంధించి జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కాలేదని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివరించారు. 2010 లో చివరి అట్రాసిటీ కేసు నమోదు అయిందని, ఇద్దరు బాధితులకు నష్టపరిహారం ఇప్పించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు పీపీ వావా మాట్లాడుతూ...మాన్యువల్ స్కావెంజర్ నిషేధచట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కృషి చేయాలన్నారు. వారి పునరావాసానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. క్రమం తప్పకుండా వారికి ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కనీస వేతనాలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని, బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు వర్తించేలా చూడాలన్నారు. అంతకుముందు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు అమలు చేస్తున్న కార్యక్రమాలను, సేఫ్టీ కిట్లను పరిశీలించారు. కమిషన్ సభ్యుని వెంట కేంద్ర సామాజిక న్యాయ విభాగం సభ్యులు గిరేందర్ నాథ్, కోఆర్డినేటర్ చరణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.