సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్

అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం... జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు.

Update: 2024-01-19 10:21 GMT

దిశ, భిక్కనూరు: అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం... జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్‌గా తీసుకునే రాజకీయ నేతలకు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో చాలామంది యూత్ సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు నేనంటే నేను బరిలో ఉన్నానంటూ లీకులిస్తున్నారు. ఆశావాహుల పేర్లు రోజు రోజుకి పెరిగిపోతుండటం హాట్ టాపిక్‌ మారింది. సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఆషామాషీ కాదని, జేబు బరువు చూసుకోవాలని, లక్షలు ఖర్చు చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తలపండిన వారు, మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోదని, ప్రజల్లో మంచితనం, పలుకుబడి కూడా అవసరమని, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజా సేవ చేయగలుగుతారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన వారికి ఖచ్చితంగా ప్రజలు వారికే పట్టం కడతారనే అభిప్రాయాన్ని మరికొందరు యూత్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా చర్చోప చర్చలు, అభిప్రాయాలు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత యువకులు ఎక్కువగా గుమిగూడిన చోట ఇదే ప్రధాన చర్చగా మారింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజెంట్ సీఎం, మాజీ సీఎంలను ఓడ గొట్టి, ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి గెలుపు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినట్లు అయ్యింది. దీంతో ఎన్నో ఏళ్లుగా తమ పార్టీ అభ్యర్థి గెలవాలని పడుతున్న కష్టానికి ఈ ఎన్నికల్లో ప్రతిఫలం లభించిందన్న సంతోషాన్ని" దిశ " తో పలువురు యూత్ పంచుకున్నారు. అయితే అదే ఊపుతో ఉత్సాహంతో ఉన్న యూత్ మధ్య సర్పంచ్‌ల పదవీకాలం ఈ నెలతో ముగుస్తుండటంతో కౌన్ బనేగా సర్పంచ్ అన్న చర్చ మొదలయ్యింది. మేజర్ పంచాయతీలను మొదలుకొని, అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో చాలామంది పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందన్న ఆసక్తితో ఉన్నారు. మరికొందరైతే ఏకంగా రహస్య ప్రాంతంలో మీటింగులు ఏర్పాటుచేసిన మందు, విందులతో దావతులు ఏర్పాటు చేసి సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూత్ ప్రధాన పార్టీల నేతల వద్దకు వెళ్లి వారిని ప్రసన్నం చేసుకుని వస్తున్నారు.

రిజర్వేషన్ మారితే నువ్వు… లేకుంటే నేను...

సర్కారు మారింది కాబట్టి... సర్పంచ్ స్థానానికి రిజర్వేషన్లు కూడా మారుతుండొచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో, అందుకు తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ మారితే పోటీలో నువ్వు ఉండాలని, మారకపోతే నేనే బరిలో ఉంటానంటూ పలువురు యూత్ ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఊరిలో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారి సంఖ్య రెండంకెలకు చేరుకుంటుండటం తో ఈసారి పోటీ టఫ్ గా ఉంటుందని భావిస్తున్నారు.


Similar News