గతంలో సెస్టెంబర్ 17ను పండుగలా జరుపుకునే పరిస్థితి లేకుండె

గడిచిన పదేళ్లలో తెలంగాణలో ప్రజలు సెప్టెంబర్ 17ను ఆనందంగా జరుపుకోలేని, పండుగలా నిర్వహించుకోలేని దుస్థితి ఉండేదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు.

Update: 2024-09-17 10:50 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : గడిచిన పదేళ్లలో తెలంగాణలో ప్రజలు సెప్టెంబర్ 17ను ఆనందంగా జరుపుకోలేని, పండుగలా నిర్వహించుకోలేని దుస్థితి ఉండేదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంబురాన్ని అధికారికంగా జరుపుకునే అవకాశం, అదృష్టం రాష్ట్ర ప్రజలకు కలిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మంగళవారం అట్టహాసంగా జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పుర ప్రముఖులకు, అధికార, అనధికారులను కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరించారు.

     మన పోరాట చరిత్ర, మన పూర్వికుల త్యాగాలు, మన రాష్ట్ర వారసత్వ పండుగను అధికారికంగా జరపడానికి గత పాలకులు ఇష్టపడలేదని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17 సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉండే రోజు అన్నారు. తెలంగాణకు బానిసత్వం, పెత్తందారీ వ్యవస్థ, అరాచక పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు కూలీ నుండి రైతు వరకు, కార్మికుడి నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డలు మొదలుకొని నూనూగు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కలిగించారని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు విముక్తి కలిగిన శుభదినమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రంను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవతో 2 జూన్, 2014న సాధ్యమైందని అన్నారు. ఏడు దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం సాధించిన రోజు జూన్ 2 అయినప్పటికీ తన దృష్టిలో సెప్టెంబర్ 17 గొప్ప చారిత్రక దినమని పేర్కొన్నారు. ఇది భౌగోళికంగా విముక్తి కలగడమే కాదని, బానిసత్వం నుండి కూడా విముక్తి లభించిందని అన్నారు. అందుకే గతేడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో సోనియాగాంధీ నాయకత్వంలో విజయసంకల్ప భేరిని కాంగ్రెస్ మోగించిందని గుర్తు చేశారు.

     తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతో పాటు గత పాలనలో లోపించిన ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా ఇస్తామని గతంలో పేర్కొన్నామని, ఆ మాట ప్రకారం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా జరుపుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలైందని, ఈ ఎమినిది నెలల్లో ఏన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీకి కూడా శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకాన్ని జిల్లాలో ఇప్పటి వరకు 4.58 కోట్ల మంది వినియోగించుకున్నారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 958 మంది పేదలకు ఉచిత వైద్యం లభించిందన్నారు. రైతులకు రూ.18 వేల కోట్లు ఖాతాలలో వేసి ఇప్పటికే 22 లక్షల పైచిలుకు రైతులను రుణ విముక్తులను చేస్తే ప్రతిపక్ష పార్టీల వాళ్లకు మింగుడు పడటం లేదని అన్నారు.

    రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు సైతం దశల వారీగా రుణమాఫీ చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షం సహనం కోల్పోయి ప్రవర్తిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.10 వేల పరిహారం రైతులకు ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వేడుకల్లో నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు సీపీ కోటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఉషా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News