బకాయి బిల్లులు అడిగితే... బస్సులు తొలగిస్తారా

ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ పెట్టిన ప్రైవేట్ బస్సులకు లక్షల రూపాయల బకాయిలు చెల్లించకపోగా, అడిగితే కంపెనీ నుండి బస్సులను తీసేశారని, దాంతో ఇన్ స్టాల్ మెంట్ కట్టేది ఎట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.

Update: 2023-09-02 09:33 GMT

దిశ, భిక్కనూరు : ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ పెట్టిన ప్రైవేట్ బస్సులకు లక్షల రూపాయల బకాయిలు చెల్లించకపోగా, అడిగితే కంపెనీ నుండి బస్సులను తీసేశారని, దాంతో ఇన్ స్టాల్ మెంట్ కట్టేది ఎట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిళ్ల ను ఒంటిపై పోసుకుని మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చెట్కూరి శివరాజ్ తన భార్యను వెంటబెట్టుకొని సంచిలో పెట్రోల్ బాటిళ్ల ను, కత్తిని వెంట తీసుకుని గ్రామ శివారులో ఉన్న రాఘవ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీకి వెళ్లాడు. తనకు రావలసిన 2.50 లక్షల రూపాయల బకాయిల గురించి ఫార్మా కంపెనీ ఇంచార్జ్ ఉమాశంకర్ ను ప్రశ్నించాడు. అంతటితో ఊరుకోకుండా తనకు రావలసిన బకాయిల గురించి అడిగితే కాంటాక్ట్ కు పెట్టిన బస్సులను తీసేసి తనకు అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు.

     ఈ సందర్భంగా బాధితుడు శివరాజ్ తో ఫార్మా కంపెనీ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. దీంతో అసహనానికి గురైన బాధితుడు శివరాజ్ అతడి భార్య జ్యోతి వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని కంపెనీ సిబ్బంది సహకారంతో వారిని అడ్డుకున్నారు. వారి చేతిలో ఉన్న పెట్రోల్ బాటిళ్ల ను, అగ్గిపెట్టెను లాక్కోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడుచుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని వారి దగ్గర ఉన్న కత్తిని లాక్కొని కంపెనీ లోపల ఉన్న వాటర్ ట్యాంకర్ నుండి వారిపై నీళ్లను పోయించి భార్య భర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భార్యను అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా శివరాజును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు శివరాజ్,అతని భార్య జ్యోతి మాట్లాడుతూ తాము రాఘవ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో మూడు బస్సులను, రెండు కార్లను పెట్టడం జరిగిందని,

    ఇందుకు గాను అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా ఒక బస్సుకు లక్షా 22 వేల రూపాయలు, కారుకు 20వేల రూపాయలను కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. గతంలో బాగానే చెల్లించిన యాజమాన్యం ఐదారు నెలల నుండి సరిగా డబ్బులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో సమయానికి డబ్బులు చెల్లించకపోవడం వలన బస్సులు, కార్లకు సంబంధించి ఈఎంఐలు సరిగా కట్టకపోవడంతో గత నెలలో రెండు బస్సులను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం ఒక బస్ కు సంబంధించి జూన్ నెలలో 17 రోజుల బిల్లు, మరో బస్సు కు సంబంధించి జులై నెల బిల్లు, రెండు కార్లకు సంబంధించి ఒక నెల

    బిల్లు మొత్తంగా 2.30 లక్షలు కంపెనీ నుండి బకాయి రావాల్సి ఉందని, వాటిని చెల్లించకుండా తమను బెదిరించడంతో పాటుగా తమ కాంట్రాక్ట్ ను అర్ధాంతరంగా రద్దుచేసి బెదిరింపులకు పాల్పడంతో పాటు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఉమా శంకర్ పలుమార్లు తమ కాంట్రాక్టు ను రద్దు చేయిస్తానని బెదిరిస్తూ లంచాలు తీసుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు తన చేతికి ఉన్న బంగారు ఉంగరం సైతం తానే ఇచ్చానని రోధిస్తూ వివరించాడు. తమకు న్యాయం జరిగే వరకు తాను ఊరుకునే ప్రసక్తే లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, యాజమాన్యం వెంటనే స్పందించి తనకు న్యాయం చేసి, బస్సుల కాంట్రాక్టులు యధావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు.  

Tags:    

Similar News