వానొస్తే పెనుముప్పే
భారీ వర్షం కురిసిందంటే ఆ గ్రామాల మధ్య రాకపోకలు బందవుతాయి.
దిశ, తాడ్వాయి : భారీ వర్షం కురిసిందంటే ఆ గ్రామాల మధ్య రాకపోకలు బందవుతాయి. వాహనదారులు ఆదమరిచి ప్రయాణం చేస్తే అనంత లోకాలకు వెళ్లల్సిందే. బ్రిడ్జికి బలం ఇచ్చేందుకు పోసిన మట్టి భారీ వర్షానికి కోతకు గురైంది. మళ్లీ భారీ వర్షం కురిసిందంటే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన తండా వాసులను వెంటాడుతుంది. దీంతో అటువైపుగా ప్రయాణం చేయాలనుకునే వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని జంకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండలం అన్నారం తండా సమీపంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. నత్తనడకన పనులు కొనసాగించడం వలన తండా వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దీంతో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఆ వాగు వరద ఉధృతికి బ్రిడ్జికి ఆనుకొని పోసిన మట్టి కోతకు గురై పెద్ద గుంతగా ఏర్పడింది. దీంతో మళ్లీ భారీ వర్షం కురిసిందంటే బ్రిడ్జికి ఆనుకొని వేసిన మట్టి వరదకు పూర్తిగా కొట్టుకపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో బ్రిడ్జికి ఆనుకొని ఉన్న పంట చేనులు సైతం ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వివిధ పనుల రీత్యా అన్నారం గ్రామస్తులు, తండావాసులు ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తుంటారు. దాంతో ప్రాణం అరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇకనైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.