HYDRA: జిల్లాలోనూ ‘హైడ్రా’ అమలయ్యేనా..? శిఖం భూములను రికవరీ చేస్తారా!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ‘హైడ్రా’ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2024-08-31 05:57 GMT

దిశ, కోటగిరి: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ‘హైడ్రా’ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువు శిఖం భూములకు విముక్తి కల్పించడం కోసం హైడ్రా‌ను ఏర్పాటు చేయడంతో అటు సొంత పార్టీ నేతలు, ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాల్లో కూడా ‘హైడ్రా’ మాదిరిగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇక కోటగిరి మండల కేంద్రంలోని 171 ఎకరాల విస్తీర్ణం గల నల్ల చెరువు, 42 ఎకరాలు గల దామరచెరువు, పోతంగల్ మండల కేంద్రంలోని 202 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు‌, ఉమ్మడి కోటగిరి, పోతంగల్ మండలంలోని 34 నాలుగు గ్రామ చెరువులు కలుపుకుని మొత్తం 1,622 ఎకరాలు శిఖం భూమిలో కలిగి ఉంది.

కబ్జాలో శిఖం భూమి

కోటగిరి, పోతంగల్ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా కబ్జా చేసి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చారు. మరికొందరు వెంచర్లు చేసి కమర్షియలు కట్టడాలకు ప్లాన్ చేస్తున్నారు. శిఖం భూములు చాలా వరకు కబ్జాలు అవుతున్నాయని గతంలో గ్రామస్తులు అధికారులు ఫిర్యాదు చేసిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో శిఖం భూములను పరిరక్షించాల్సిన అధికారులు బడాబాబుల ఒత్తిడిలకు లోబడి అటువైపు కన్నెత్తి చూసేందుకు సైతం సాహసం చేయలేదు.

హైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో హడల్

అడిగే వారు లేకపోవడంతో దర్జాగా శిఖం భూములను కబ్జా చేసి అక్రమంగా అనుభవిస్తున్న భూ బకాసురుల్లో హైడ్రా హడల్ పుట్టిస్తోంది. ఇన్నేళ్లు అప్పనంగా అనుభవించిన శిఖం భూములను హైడ్రా ఏ క్షణంలో భూములను స్వాధీనం చేసుకుంటుదోనని తెలిసి వారిలో గుబులు మొదలైంది. రానున్న రోజుల్లో ఉమ్మడి కోటగిరి మండలంలో హైడ్రాను అమలు చేసి శిఖం భూములకు ప్రభుత్వం విముక్తి కల్పింస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.


Similar News