హోంగార్డ్స్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన హోం గార్డ్ కమాండెంట్
వార్షిక తనిఖీలలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కార్యాలయాన్ని తెలంగాణ రీజియన్ కమాండెంట్ మూర్తి బుధవారం తనిఖీ చేశారు.
దిశ, నిజామాబాద్ సిటీ : వార్షిక తనిఖీలలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కార్యాలయాన్ని తెలంగాణ రీజియన్ కమాండెంట్ మూర్తి బుధవారం తనిఖీ చేశారు. కాగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆయనకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ నుండి వచ్చిన హోం గార్డ్స్ గౌరవవందనం చేశారు. ఈ సందర్బంగా ఐఆర్ఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హోం గార్డులకు అధిక మొత్తంలో జీతాలు ఇస్తుందని అన్నారు. నిజామాబాద్ హోం గార్డ్స్ విభాగం పరేడ్ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కితాబు ఇచ్చారు. సిబ్బంది ఎల్లప్పుడు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలని, ప్రతీరోజు వ్యాయమం చేయాలని సూచించారు.
సిబ్బందికి ఏదైనా సమస్యలు ఉంటే వారి పై స్థాయి అధికారులకు తెలియజేయాలని తెలిపారు. వారి సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరిస్తుండాలని పేర్కొన్నారు. సిబ్బంది దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు తమ బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలని తెలిపారు. ఎలాంటి రిమార్కులు లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని అన్నారు. అనంతరం వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ ప్రతిభకనబరచిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ నాగరాజు, అదనపు డీసీపీ (ఎ.ఆర్) గిరిరాజు, హోమ్ గార్డ్స్ ఎసీపీ వి. శ్రీనివాస్, ఎఆర్ ఏసీపీ ఎన్. సంతోష్, రిజర్వు ఇన్స్ పెక్టర్ వి. శేఖర్, అనిల్ కుమార్ ( అడ్మిన్), శైలేందర్ (ఎమ్ టీఓ), పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ సరళ , ఆర్ఎస్ఐలు, వాసవి హార్ట్ కేర్ డాక్టర్ రవికిరణ్, సిబ్బంది హజరయ్యారు.