చైన్ స్నాచర్ ను పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన దొంగలను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 20: నిజామాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన దొంగలను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మొగులయ్య తన సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించగా..అతను పారిపోయాడు. వెంటనే పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గోవర్ధన్ ఘాట్ కు చెందిన వంట మనిషి శ్రీహరి దేవీదాస్ శర్మ అలియాస్ హర్యా అలియాస్ హరీష్ అని తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తిని లోతుగా విచారించగా తను చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్ ఐ మొగులయ్య తెలిపారు.
ఇప్పటి వరకు నిందితుడు ఫోర్త్ టౌన్ ఏరియాలో హౌజింగ్ బోర్డు కాలనీలో రెండు చైన్ స్నాచింగ్ లు, త్రీ టౌన్ ఏరియాలో సుభాష్ నగర్ లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ లైన్, ఆర్టీసీ బస్టాండ్ ముందు చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్తుంటే అడ్డు వచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి చేసి పారిపోయానని ఒప్పుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బర్సాత్ అమీర్ గ్యాంగ్ తో కలిసి మూడు నేరాల్లో పాలు పంచుకున్నట్లు కూడా నిందితుడు తెలిపినట్లు ఎస్ ఐ వివరించాడు. పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు శ్రీహరి దేవీదాస్ శర్మ, ఇతని గ్యాంగ్ టూ వీలర్స్ పై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళ మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకుని వెళ్లడం..ఎవరైనా అడ్డుపడితే కత్తితో దాడి చేస్తారని తెలిపారు. నాందేడ్ లో రవి లాలా అనే వ్యక్తి వద్ద రూ. 30 వేలు చెల్లించి ఒక దేశీ తుపాకీని, ఒక రౌండ్ కొనుగోలు చేసినట్లు వివరించాడు. వెపన్ కొనుగోలు చేశాక నిజామాబాద్ నగరంలో ఏదైనా నేరం చేద్దామనే ఆలోచనతో బుధవారం నిజామాబాద్ వచ్చాడు. అయితే రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులకు పట్టుబడినట్లు పోలీసుల విచారణతో తేల్చారు. నిందితుడి వద్ద నుండి ఒక నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ ను పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకుని, నిందితుడు శ్రీహరి దేవీదాస్ శర్మ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ ఐ మొగులయ్య తెలిపారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ పేర్కొన్నారు.