కామారెడ్డి జలమయం.. రోడ్ల పై నిలిచిన వర్షపు నీరు..

కామారెడ్డిలో శనివారం సాయంత్రం నుంచి భారీగా వర్షం కురుస్తూనే ఉంది.

Update: 2024-09-01 12:37 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డిలో శనివారం సాయంత్రం నుంచి భారీగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రంతా ఎడతెరపి లేకుండా కురిసిన వాన ఆదివారం కూడా కంటిన్యూ అవుతోంది. భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంలోని రహదారులన్నీ నీటితో జలమయం అయ్యాయి. రహదారిలో గుంతలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిజాంసాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్డు, సాయిబాబా ఆలయం ఉన్న విద్యానగర్ కాలనీ, పంచముఖి హనుమాన్ కాలనీ, రామారెడ్డి రోడ్డు, బతుకమ్మ కుంటతో పాటు పలు రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల పై వరదలా నీళ్లు పారుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్ల పై వరద ఉధృతి ఉన్న ఒకవైపు రోడ్లను పోలీసులు మూసివేశారు. సురక్షిత ప్రాంతాల నుంచి వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు చేరుతోంది. ట్రాక్ పై నీరు తక్కువగా ఉండటంతో రైల్వే ట్రాక్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. మరోవైపు గ్రామాల్లోని పలు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. గ్రామాల్లో భారీ వర్షం కారణంగా పొలాల్లోకి నీరు చేరుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కామారెడ్డి చెరువు నిండి పరవళ్లు తొక్కుతోంది. కామారెడ్డి చెరువు చూడటానికి ప్రజలు వెళ్తున్నారు. చెరువు జలకళ సంతరించుకోవడంతో పాటు భారీ వరద వస్తుండటంతో అటువైపుగా వెళ్లవద్దని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సోమవారం నిర్వహించే ప్రజావాణి సైతం భారీ వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.


Similar News