నిధులు లేక నీరసంగా గ్రామ పంచాయతీలు

ఏర్గట్ల మండలం లో నేడు గ్రామ పంచాయతీలకు నిధుల కొరత వేధిస్తోంది. గత 2 సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన గ్రాంట్లు గ్రామ పంచాయితీలకు చేరకపోవడంతో నేడు పంచాయితీలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Update: 2024-06-26 03:58 GMT

దిశ, ఏర్గట్ల : ఏర్గట్ల మండలం లో నేడు గ్రామ పంచాయతీలకు నిధుల కొరత వేధిస్తోంది. గత 2 సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన గ్రాంట్లు గ్రామ పంచాయితీలకు చేరకపోవడంతో నేడు పంచాయితీలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో మాజీ సర్పంచులు ఒత్తిడిలకు గురిచేసి పూర్తి చేసిన పనులకు రూ. లక్షలు బిల్లులు చెల్లించకపోవడంతో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి దుర్బరంగా మారింది. ఇకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో పారిశుధ్య పనులకు డబ్బులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని నెలలుగా పంచాయితీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతుండడంతో గ్రామాల్లో రోజు వారి పనులకు సర్పంచ్ లు 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు అవి కూడా రావడం లేదు. మంజూరైన అరకొర నిధులు కూడా సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. అయితే రూ. లక్షలు ఖర్చు చేసి ఎన్నికైన తాజా మాజీ సర్పంచులు, గ్రామ పంచాయితీల్లో లక్షల రూపాయల పెండింగ్ బిల్లుల మంజూరులో జాప్యం వల్ల పల్లెల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణం

చిన్న పంచాయితీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పంచాయితీలలో పనులు చేయకపోతే గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తుంటే ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక కార్యదర్శుల పరిస్థితి అయోమయంగా మారింది. పంచాయితీలకు వచ్చే ఆదాయ వనరులు తగ్గిపోవడంతో పనులు చేయించేందుకు కార్యదర్శులు అనేక తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ఉన్నా డీజిల్ పోయడానికి డబ్బులు లేక కార్యదర్శులు సొంతంగా డబ్బులు పెట్టి డీజిల్ పోయించిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఎలా ఉన్నా కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.

జీతాలకు ఇబ్బందులు

మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో నిధులు కొరత ఏర్పడడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీ పరిధిలో పన్నులు వసూలు కాక, పంచాయతీకి చెందిన ప్రత్యేక నిధులు లేక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న గ్రామ పంచాయతీలలో వంద శాతం బిల్లులు వసూలు చేసినా కూడా ఆ డబ్బులు కేవలం రెండు లేదా, మూడు నెలలు మాత్రమే సిబ్బంది జీతాలకు సరిపోతుంది. దీనికితోడు అక్కడక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అక్కడక్కడ పంచాయతీలలో సిబ్బందికి జీతాలు సమయానికి అందక విధుల నుంచి తప్పుకుంటున్నారు. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయితీల్లో ఆదాయం తక్కువ ఉండడంతో సిబ్బంది జీతాల చెల్లింపు కూడా కష్టమవుతోంది. పెద్ద పంచాయితీలలో ఇంటి పన్నుల ఆదాయం తో సిబ్బంది జీతభత్యాలు మాత్రం చెల్లించగలుగుతున్నారు. కానీ చిన్న పంచాయతీ లలో పన్నుల ఆదాయం తక్కువగా ఉన్న చోట మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఇక చిన్న పంచాయితీలలో ఆరు నెలలుగా ట్రాక్టర్లకు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించలేక ట్రాక్టర్లను బ్యాంక్ సిబ్బంది పట్టుకెళ్లే పరిస్థితి నెలకొంది.

పాత పంచాయతీలకు మాత్రమే సొంత భవనాలు

మండలంలో పాత గ్రామ పంచాయితీలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. గత ప్రభుత్వం నూతన పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయడంతో కొత్త గ్రామ పంచాయితీలు నిర్మాణం పూర్తయినప్పటికీ మండలంలోని నాగేంద్ర నగర్ పంచాయతీ భవనం పూర్తి అయ్యి ప్రారంభోత్సవం జరిగినా ఇంత వరకు బిల్లులు విడుదల కాలేదు. తాళ్ళ రాంపూర్, దోంచంద లో పంచాయతీ భవనాలు నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. తడపాకల్ గ్రామంలో పంచాయతీ రాజ్ నిధులతో నిర్మించిన పల్లె దవఖానాకు సంబంధించిన నిధులు మంజూరు కాక ఉపాధి హామీ బిల్లులు, పంచాయతీరాజ్ బిల్లులు ఆగిపోవడంతో లక్షల రూపాయలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

ఈజీఎస్ నిధులే దిక్కు

గ్రామాల్లో ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిదులే ఆధారంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పంచాయతీ భవనాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రహరీ గోడలు ఉపాధి హామీ నిధులతోనే జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రతి పనికి ఉపాధి హామీ నిధుల పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన పల్లె దవఖానాకు సంబంధించిన నిధులు, ఉపాధి హామీ నిధులు కూడా సకాలంలో విడుదల కాకపోవడంతో మాజీ సర్పంచులు, మెటీరియల్ సరఫరా చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయితీలకు విడుదల చేయాల్సిన నిధులు మంజూరు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అందితేనే పంచాయితీల ప్రధాన ఆర్థిక సమస్యలు తొలగిపోయి పంచాయితీలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటాయి.


Similar News