ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

Update: 2024-03-26 15:13 GMT

దిశ, కామారెడ్డి : యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలిపారు. జిల్లాలో 347 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటిలో సహకార సంఘాల ద్వారా 325, ఐకేపీ ఆధ్వర్యంలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట కోతలకు అనుగుణంగా ప్రారంభించాలని చెప్పారు. ఎక్కడా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుండా చూడాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ రైతుల వద్ద నుంచి మద్దతు ధర పై ఇబ్బందులేకుండా కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.

    జిల్లాలో 347 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. యాసంగి సీజన్​లో గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటా 2 వేల 203 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు 2 వేల 183 రూపాయల మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు, టార్ఫాలిన్లు, క్లీనర్లు, వెయింగ్ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం 17 లోపు ఉండాలనే అంశాలపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని,

    రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

     ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ భారత ఆహార సంస్థకు సకాలంలో డెలివరీ చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ చందర్ నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు రఘునాథరావు, ప్రభాకర్, రమేష్, సిపిఓ రాజారాం, కలెక్టరేట్ ఎవో మసూర్ అహ్మద్, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, తాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.


Similar News