శాసనసభలో స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుంది: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల ఫైర్

తాము ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలను చర్చిద్దాం అంటే ప్రభుత్వం మైకును కట్ చేసి తమ గొంతు నొక్కుతోందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు..

Update: 2023-02-23 07:27 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : తాము ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలను చర్చిద్దాం అంటే ప్రభుత్వం మైకును కట్ చేసి తమ గొంతు నొక్కుతోందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డు అడ్లూరులో గురువారం ప్రజా గోష బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పు అయినా పసిగట్టి తొలికూత కుసేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే అన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది నిజామాబాద్ జిల్లా నే అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను చర్చించడానికి ఎన్నుకోబడిన తాను ఒకరా ఇద్దరా అనేది ముఖ్యం కాదన్నారు. సంఖ్య బలాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం శాసనసభలో కూడా స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని కల్పించడం లేదన్నారు.

రాష్ట్ర ప్రజల సమస్యలను చర్చించి పరిష్కారం చూపేది శాసనసభ అయినప్పటికీ, అందుకు భిన్నంగా శాసనసభను అధికార పార్టీ తయారు చేసిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీజపీ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు నిలబడగానే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల వద్దకు ప్రజాప్రతినిధుల గొంతులు వెళ్లకుండా అధికార పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తుందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని, డబుల్ బెడ్ రూమ్‌‌లు ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో 70 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర మహిళలు నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వీరికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుండగా తీసుకున్న రుణాలు 100% కట్టి దేశంలో 99 శాతం రికవరీలో పేరు సాధించాలన్నారు. మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్డీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు.

నాలుగున్నర ఏళ్లుగా మహిళలకు వడ్డీ వాపస్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఇప్పటికీ 4200 కోట్ల వడ్డీ బాకీ పడిందన్నారు. 2018 జూన్ మాసంలో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందించినప్పటికీ గత 6 సంవత్సరాలుగా అందించకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు మాత్రం పనగల్లు దాటడం లేదన్నారు.

రైతులు వరి ధాన్యం అమ్మే సమయంలో క్వింటాలుకు ఆరు కిలోల చొప్పున కట్ చేస్తూ రైతులను ప్రభుత్వ మోసం చేస్తుందన్నారు. ఒక చేతితో ఇస్తూ మరో చేత్తో రైతు నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్, మర్రి రాంరెడ్డి, విపుల్ జైన్, నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ సుతారీ రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News