రోగులపై ఎలుకల దాడి పై ప్రభుత్వం సీరియస్

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోనీ ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Update: 2024-02-12 17:18 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోనీ ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్‌ను విచారణ నిమిత్తం జిల్లా ఆస్పత్రికి పంపించింది. కమిషనర్, జిల్లా కలెక్టర్ నివేదికతో సాయంత్రం లోపు ఘటనకు బాధ్యులను చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐసీయూ ఇంచార్జి డా. కావ్యతో పాటు స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఆస్పత్రి సూపరిండెంట్ డా. విజయలక్ష్మిని కలెక్టర్‌కు సరెండర్ చేశారు. వీరి సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అదేశించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా డీఎంఈ విభాగం నుంచి సంగారెడ్డికి చెందిన డా. అనిల్ బృందం జిల్లా ఆస్పత్రిలో విచారణ చేపట్టింది. ఆస్పత్రిలోని ఐసీయూను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులను సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. ఎలుకలు రాకుండా ఉండేందుకు తీసుకునే చర్యల గురించి వివరాలు తీసుకున్నారని సమాచారం. ఆస్పత్రిలో ఎలుకలు రావడానికి గల కారణాలను అన్వేషించినట్లు తెలిసింది. శానిటేషన్ విభాగాలను కూడా డీఎంఈ బృందం పరిశీలించారు.


Similar News