ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్​మోహన్​రావు ఓటర్లకు సూచించారు.

Update: 2023-11-23 11:41 GMT

దిశ, లింగంపేట్ : శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్​మోహన్​రావు ఓటర్లకు సూచించారు. గురువారం లింగంపేట మండలంలోని కొండాపూర్, ముంబాజిపేట్ తండా, భవానిపేట్, రాంపూర్, బాణాపూర్, బాణాపూర్ తండా, కోర్పుల్, నల్లమడుగు, లింగంపల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఒక్కసారి అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపాలని ఆయన ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని బడుగు, బరులహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడానికి తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకబడిందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశాడని అన్నారు.

    రుణమాఫీ విడతల వారీగా చేయడం వల్ల మాఫీ డబ్బులు మిత్తికి సరిపోయినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సురేందర్ ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం తనకు వచ్చే వేతనంలో నుండి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని మిగిలిన డబ్బులు నిరుపేదల సంక్షేమానికి ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ

    ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన మదన్మోహన్ రావుకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ముంబాజిపేట గ్రామంలో చిన్నారులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నారా గౌడ్, ఎల్లమయ్య, కౌడ రవి, సాయికుమార్, గుర్రం కిష్టయ్య, గులాం భాస్కర్ గౌడ్ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Similar News