కారు దిగి... కమలంలో చేరి.. అంతలోనే మళ్లీ..

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు.

Update: 2023-11-25 05:26 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. అలాంటి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ కొందరు రాజకీయ ప్రజా ప్రతినిధులు, నాయకులు చక చకా పార్టీల కండువాలను మారుస్తున్నారు. రాత్రి ఒక పార్టీలో ఉంటే... తెల్లారే సరికి ఇంకో పార్టీలోకి మారి కండువాలు కప్పుకుంటూ దర్శనమిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక నెల రోజుల నుంచి నాయకులు రాత్రి ఒక పార్టీలో ఉంటే తెల్లారేసరికి కండువాలు మార్చి.. అటు తర్వాత మళ్లీ తిరిగి అదే పార్టీలోకి వస్తున్నారు. ఇలా పార్టీలు మారినోళ్లను నయానో, భయానో మళ్లీ వారి పార్టీలోకి వెనక్కి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సరిగ్గా ఆర్మూర్ నియోజక వర్గంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఆ పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి జై కొట్టి కాషాయ తీర్థాన్ని పుచ్చుకోగా, ఏమైందో ఏమో గాని తెల్లారేసరికి పలువురు నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువాలను కప్పుకుంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని గుత్ప తండా గ్రామం సర్పంచ్ దంపతులు, నందిపేట్ మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌ల భర్తలు, ఉపసర్పంచులు కారు దిగి కమలం పువ్వును పట్టుకొని తెల్లారేసరికి మళ్లీ కారెక్కడంతో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. కారులో ప్రయాణమే బాగుందనో.. లేదా మళ్లీ గులాబీ కండువా కప్పుకోవడానికి అంతర్గతంగా ఏం జరిగి ఉంటుందోనన్న చర్చోపచర్చలు ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్నాయి. రాత్రి ఓ పార్టీలో తెల్లారేసరికి మరో పార్టీలోకి వస్తున్న.. పార్టీలు మారే నేతల తీరు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. అసలు ఈ పార్టీల మార్పు వెనక అసలేం జరుగుతుందని చర్చ సాగుతోంది.


Similar News