శ్రీ చైతన్య స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం

కామారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో 8, 9, 10 తరగతులకు పర్మిషన్ లేకున్నా స్కూల్ నడిపిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.

Update: 2024-02-03 11:52 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో 8, 9, 10 తరగతులకు పర్మిషన్ లేకున్నా స్కూల్ నడిపిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా పాఠశాలకు సరైన ఆట మైదానం లేదని, బస్సులకు కూడా ఎలాంటి అనుమతులు లేవని, వాటికి నంబర్ ప్లేట్లు లేకుండా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవితేజ చాంబర్ లోని కుర్చీలను, కిటికీని ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా గత ఆరు నెలలుగా 8, 9, 10 తరగతులను ఎలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

    వచ్చే నెలలో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ విషయమై డీఈవో, ఎంఈవోల కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంవత్సరానికి ఒక్కో విద్యార్థి దగ్గర 40 వేల నుండి 60 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలకు అనుమతులు తీసుకోవాలనే విషయాన్ని మర్చిపోయారన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ చైతన్య హైస్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని, పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి బస్సులను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా విషయాన్ని తెలుసుకున్న ఎంఈఓ ఎల్లయ్య పాఠశాలకు చేరుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 8, 9, 10 తరగతులను సీజ్ చేశారు.


Similar News