ఆ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం.. ఖంగుతిన్న బాధితులు..

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గల హెచ్ పీ పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ లలో నీళ్లు మిక్స్ అయి వస్తున్నాయని బాధితులు ఆందోళన చేపట్టారు.

Update: 2023-03-11 11:12 GMT

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గల హెచ్ పీ పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ లలో నీళ్లు మిక్స్ అయి వస్తున్నాయని బాధితులు ఆందోళన చేపట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 6:30 గంటలకు గ్రామంలో ఫిల్టర్ వాటర్ సప్లై చేసే ఆటోలో రెండు వేల రూపాయల డీజిల్ పోయించాడు. ఆ తరువాత ఆటో స్టార్ట్ చేయబోతే ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ వేరొక బాక్స్ లోకి డీజిల్ ని తీసి పరిశీలించాడు. ఆ డీజిల్ లో మొత్తం నీళ్లు మిక్స్ ఉండడాన్ని గమనించాడు.

బాధితుడు ఇదేమిటని పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కావాలంటే కేసు పెట్టుకో పో, వినియోగదారుల ఫోరంలో వెళ్లి కేసుపెట్టు అంటూ దబాయింపులకు దిగాడు. ఇదిలా కొనసాగుతుండగానే గోపన్పల్లికి చెందిన మరొక వ్యక్తి వచ్చి తనకు పోసిన పెట్రోల్ లో కూడా నీళ్లు వచ్చాయంటూ బాటిల్ తీసి చూపించాడు. అలాగే బిచ్కుందలో ఓ ప్రజాప్రతినిధి వాహనంలో కూడా నీళ్లు కలిసిన డీజిల్ ని పోయడంతో ఆయన వాహనం మధ్యలోనే ఆగి ఇబ్బంది పడ్డానని చెప్పడం గమనార్హం. ఇంత జరిగినప్పటికిని బంకు యాజమాన్యం ఏమాత్రం జంకు లేకుండా ఏం చేస్తారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. కాగా బాధితుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో బంక్ యాజమాన్యంపై ఫిర్యాదు ఇచ్చారని బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.

Tags:    

Similar News