గదుల పైకెక్కి ఆశ్రయం పొందిన పేదలు..

కుండపోతగా కురుస్తున్న వర్షానికి, నడుములోతు వరద నీళ్లు డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వచ్చి చేరడంతో, ఏం చేయాలో పాలుపోక బంగ్లాల పైకెక్కి, సహాయం కోసం ఎదురు చూసిన వైనం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-09-01 16:12 GMT

దిశ, భిక్కనూరు : కుండపోతగా కురుస్తున్న వర్షానికి, నడుములోతు వరద నీళ్లు డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వచ్చి చేరడంతో, ఏం చేయాలో పాలుపోక బంగ్లాల పైకెక్కి, సహాయం కోసం ఎదురు చూసిన వైనం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లలో సుమారు 45 మంది నివాసం ఉంటున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో, సామాన్లతో సహా పై గదులలోకి కొందరు చేరుకోగా, మరికొందరు బంగ్లాల పైకెక్కి ఆశ్రయం పొందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తూ గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అందరూ పైకెక్కి ఆశ్రయం పొందగా, పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధురాలు గల్లంతయిందని ప్రచారం జరిగింది.

దీంతో ఎస్సై సాయి కుమార్, తహశీల్దార్ శివప్రసాద్, ఇంచార్జి ఎంపీడీఓ రాజ్ కిరణ్, ఏఎస్ఐ జగదీష్, ఆయా శాఖల సిబ్బంది, గ్రామనాయకులు, యువకులు, అక్కడికి చేరుకొని వరద నీటిలో చిక్కుకున్న నిరుపేదలను బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లారు. డబుల్ బెడ్ రూం గదులు సగం లోతు వరకు మునిగిపోవడంతో, వాటిలోకి వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గల్లంతైన వృద్ధురాలిని సైతం నీళ్లలో ఉందన్న విషయాన్ని గుర్తించి ఆమెను కూడా బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం గదులు కాళీ చేయించి గ్రామంలోని పాఠశాలకు షిఫ్ట్ చేసి పునరావాసం కల్పించారు. తిండి తిప్పలు లేకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి వారికి భోజనాలు తెప్పించి పెట్టించారు. ముఖ్యంగా అధికారులు చేసిన సహాయానికి అటు నిరుపేదలు ఇటు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తప్పిన పెను ప్రమాదం..

గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలో ఉన్న చెరువు కట్టమీదుగా ఇటీవల రిలయన్స్ గ్యాస్ వాళ్ళు పైప్ లైన్ వేసినప్పటికీ సరిగా మట్టిని పూడ్చకపోవడంతో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి ధాటికి కట్ట మట్టి కొట్టుకపోయింది. వెంటనే స్పందించిన తహశీల్దార్ ఎంపీడీఓ, భిక్కనూరు ఎస్ఐ ఇరిగేషన్ అధికారులు మొరం తీసుకువచ్చి కట్టను బాగు చేయించారు. ఈ విషయం ఎవరు గమనించకపోతే చెరువు కట్ట పూర్తిగా తెగిపోయి పెద్ద ఎత్తున చెరువు నీరు పక్కనే గల జాతీయ రహదారి పైకి చేరి రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడేది. అధికారులు స్పందించి కట్టను బాగు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.


Similar News