ఎంపీ అర్వింద్ కు తొలి ఓటమి

2017లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు అచ్చి రాలేదని చెప్పాలి.

Update: 2023-12-03 13:23 GMT

దిశ ప్రతినిది, నిజామాబాద్ : 2017లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు అచ్చి రాలేదని చెప్పాలి. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ కు అక్కడ అధికార పార్టీ చేతిలో తొలిసారి ఓటమిని చవి చూశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ చిన్నకుమారుడు అయిన ధర్మపురి అరవింద్ తండ్రి, సోదరుడిని కాదని మోడీ విదానాలు నచ్చి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి నాటి సిట్టింగ్ ఎంపీ, సీఎం కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి సంచలనం రేపారు. 2018లో చెరుకు రైతుల కొరకు బోధన్ నుంచి మెట్ పల్లి వరకు పాదయాత్ర చేసి రైతుల మనస్సులను చూరగొన్న అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ రాసిచ్చి ఎన్నికలకు వెళ్లి గెలుపొందిన విషయం తెల్సిందే. బీజేపీలో సాధారణ కార్యకర్తగా చేరిన అరవింద్ ఏకంగా నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన తన పట్టును పెంచుకున్నారు. నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చడంతో పాటు తనకు వ్యతరేకంగా పావులు కదిపిన యెండల లక్ష్మీనారాయణ వర్గానికి

    మున్సిపల్ ఎన్నికల్లో చుక్కలు చూపారు. తాను చెప్పిన వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించి 29 స్థానాలు గెలిచేలా చేసిన విషయం తెల్సిందే. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి బీజేపీ జెడ్పీటీసీలు ఎన్నిక కావడంలో అరవింద్ రాజకీయ చతురత చూపారు. తర్వాత పార్టీ పదవుల్లో తన వర్గాన్నే పెంచుకుంటూ పోయారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తనకు వ్యతిరేకంగా ఉన్న యెండల లక్ష్మీనారాయణకు బాన్సువాడకు వలస వెళ్లలా చేశారు. అయితే తాను ఎంపిక చేసిన ఏడుగురు బీజేపీ అభ్యర్థులు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బరిలో ఉండగా అందులో ఎంపీ అరవింద్ ఓటమి పాలవ్వడం పార్టీలో చర్చకు దారి తీసింది. పసుపు బోర్డు సాధించిన తర్వాత ప్రధాని మోడీని రప్పించి బహిరంగ సభ నిర్వహించిన తాను తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూడడం

    రాజకీయంగా తొలి ఓటమి అని చర్చ జరుగుతుంది. అయితే ఎంపీ అర్వింద్ ఏరికోరి నిజామాబాద్ అర్బన్ ధన్ పాల్ సూర్యనారాయణకు, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించి వారి గెలుపు కోసం చేసిన ప్రచారం ఫలించింది. వారిద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరపున ఎమ్మెల్యేగానీ, ఎంపీ గానీ ఒక్కొక్కరు ఏకకాలంగా ఎంపికయ్యారు. తొలిసారి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కామారెడ్డి నుంచి బరిలో నిలిచిన బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీలో మరో ఫైర్ బ్రాండ్ గా అవతరించారు. ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా, ఈ ఫలితాలతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బూస్ట్ అవుతాయని చెప్పవచ్చు. బీజేపీ నుంచి గెలుపొందిన వెంకటరమణారెడ్డికి బీజేఎల్ పీ లో స్థానం దక్కే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Similar News