murder : హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ..కట్ చేస్తే సీన్ రివర్స్

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు.

Update: 2024-10-29 13:50 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు.హత్య చేసినట్టు అనుమానం రాకుండా..చెట్టుకు తాడు తో వేలాడాదీసి ఆత్మహత్య గా చిత్రీకరణకు విఫల యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే... మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన తోకల కృష్ణ (31) డైరీ లో పాల ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు పరిసర గ్రామాలైన అక్కాపూర్, అన్నారం, ఇసాయి పేట తదితర గ్రామాల నుంచి ఉదయం, సాయంత్రం పాలను సేకరించి కామారెడ్డి డైరీ కి చేరవేస్తాడు. సోమవారం రాత్రి వరకు పాల సేకరణకు రాకపోవడంతో.. ఇసాయి పేట, అన్నారం గ్రామాల పాల కేంద్రం నిర్వాహకులు డైరీ నిర్వాహకులకు ఫోన్ చేశారు. డైరీ నిర్వాహకులు కృష్ణకు ఫోన్ చేయడంతో తాను ఆపదలో ఉన్నానని తనను వెంబడిస్తున్నారని నిర్వాహకులతో చెప్పినట్లు సమాచారం. వెంటనే డైరీ నిర్వాహకులు పాల కేంద్రం నిర్వాహకులతో విషయం చెప్పి అతని ఆచూకీ కోసం వెతకాలని కోరారు. అన్నారం పాల కేంద్రం నిర్వాహకులు 10 నిమిషాలలో ఇసాయిపేట అన్నారం రోడ్డు కు చేరుకున్నారు. ఇసాయి పేట సమీపంలోని కల్వర్టు దగ్గర ఆటో ఆగిపోయి ఉన్నదాన్ని గమనించారు. ఆ కల్వర్టు పరిసర ప్రాంతాల్లో వెతకగా చెట్టుకు వేలాడేసిన కృష్ణ శవం కనిపించింది. ఓమిని వాహనం లో ఆటో ను వెంబడించి మరీ హత్య చేశారు. ఇటీవల కురిసిన వరదలకు కల్వర్టు తెగిపోవడంతో.. ఆటో వేగంగా వెళ్లలేక వారికి చిక్కినట్లు స్థానికులు వివరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాచారెడ్డి ఎస్ఐ అనిల్, కామారెడ్డి సిఐ వామన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

భార్య అక్రమ సంబంధమే కారణమా...?

ప్రేమించి పెళ్లి చేసుకున్నమృతుడు కృష్ణ దంపతులకు ఒక కూతురు ఉంది. కాపురంలో గత కొన్ని రోజులుగా మనస్పర్థలు వచ్చినట్టు సమాచారం. భార్య ప్రవర్తన లో మార్పు కోసం కృష్ణ హితవు పలికారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రవరూపం దాల్చాయి. మృతుని తల్లి తన కొడుకును చంపివేస్తారని ఆందోళనకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఆమె ఆందోళన కు గురైన మరుసటి రోజే మృత్యువాత పడటం గ్రామంలో చర్చనీయాంశమైంది.

పోలీసుల అదుపులో నిందితులు?

ఇసాయిపేట - అన్నారం రోడ్డులో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిలో మాచారెడ్డి కి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.


Similar News