పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-24 12:22 GMT

దిశ, మాచారెడ్డి: సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మాచారెడ్డి మండల కేంద్రంలోని డ్రాగాన్ పండ్లతోట, కొత్త పల్లి గ్రామంలోని నర్సరీ, సోమార్ పేట్ లోని వరి ధాన్యం కేంద్రం, మాచారెడ్డి లోని శారీ సెంటర్, లక్ష్మీ రావుల పల్లి లోని డైరీ ఫాం లను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తక్కువ నీటి వినియోగం, తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ సాగుపై రైతులను ప్రమోట్ చేయాలని సూచించారు. కేవలం 45 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని, తన ఎకరం పొలంలో పండిస్తున్న పంటను 2 టన్నుల డ్రాగన్ ఫ్రూట్ ను ఇప్పటి వరకు అమ్మి 3 లక్షల రూపాయలు సంపాదించామని లబ్ధిదారు యాసీన తెలిపారు. మహిళా శక్తి పథకం క్రింద మహిళా సంఘం నుంచి 3 లక్షల రూపాయలు రుణం తీసుకుని డ్రాగన్ ఫ్రూట్ సాగుచేయడం జరుగుతున్నదని తెలిపారు. ఒకసారి పంటను వేస్తే 20 సంవత్సరాల పాటు పంట వస్తుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లి లోని పట్టు పురుగుల యూనిట్ ను కలెక్టర్ పరిశీలించారు. అదే గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం చేపడుతున్న బోడ శ్రీకాంత్ తన తల్లి పేరున మహిళా సంఘం నుంచి లక్ష రూపాయలు రుణం తీసుకుని పంటల సాగు చేస్తున్నానని తెలిపారు. సంవత్సరానికి సుమారు 5 నుంచి ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నామని, తన కుటుంబ సభ్యులే పనులు చేస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం సొమార్ పేట్ లో ఐ.కే. పి. మహిళలు నిర్వహించే ధాన్యం కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి.. ధాన్యాన్ని పరిశీలించారు. వరి ధాన్యాన్ని ఆర బెట్టి కేంద్రానికి తీసుకు వచ్చే విధంగా రైతులకు తెలియజేయాలని అన్నారు . గోదాం నిర్మాణానికి మహిళా సంఘానికి భూమి కేటాయించాలని గ్రామస్తులు కోరారు. అనంతరం మాచా రెడ్డి గ్రామంలో మహిళా సంఘం నుంచి మహిళా శక్తి పథకం క్రింద బ్యాంక్ లింకేజ్ క్రింద 3.75 లక్షల రుణం తీసుకొని శారీ సెంటర్, చెప్పుల దుకాణం నడిపిస్తున్న తస్లీమా బేగం దుకాణాన్ని కలెక్టర్ సందర్శించి..వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ రావుల పల్లె గ్రామంలోని తుమ్మ రవళి మహిళా శక్తి పథకం క్రింద మహిళా సంఘం నుండి రుణం తీసుకొని పాల ఉత్పత్తి, వ్యాపారం ప్రారంభించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజూ 12 లీటర్ల పాలు తీస్తున్నామని, ప్రతీ పది రోజులకు రు. 7500/- సంపాదిస్తున్నమని తెలిపారు. బ్యాంకు లింకేజ్ క్రింద తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆదాయ మార్గాలు ఎంచుకొని ఆ దిశగా వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ అధికారి శ్రీనివాస్ రావు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహ రావు , తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ , తదితరులు పాల్గొన్నారు.


Similar News