ఇది 60 ఏండ్ల, అమరుల పోరాట ఫలితం.. శాసనసభ స్పీకర్ పోచారం

భారత దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగను చేసుకోవడం నిజంగా చారిత్రాత్మకమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-03 10:25 GMT

దిశ, బాన్సువాడ : భారత దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగను చేసుకోవడం నిజంగా చారిత్రాత్మకమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం భైరాపూర్ గ్రామంలో గల రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు పండుగలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయనను మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో పోచారం స్వయంగా ట్రాక్టర్ ను నడిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతు పండుగ చేసుకోవడం దేశంలోనే మొదటిసారన్నారు. 1960లో నీళ్లు, నిధులు, నియమకాలు అన్న నినాదాలతో చెన్నారెడ్డి ఆధ్వర్యంలో మొదలైన ఉద్యమం నీరుగారి పోయిందన్నారు.

తదనంతరం 2001లో కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి, 13 ఏండ్లు సుధీర్ఘ పోరాటం చేస్తే, ఎంతో మంది అమరుల త్యాగఫలంతో కేంద్రం భయపడి దిగి రావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సుసాధ్యమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే అమాయకులైన వారు రైతులేనని, వారిని మనందరం కాపాడుకుందామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలను ఉన్నకాడికి నిధులను సరిపెట్టుకో అని చెప్పేవారని, తెలంగాణ వచ్చిన తరువాత ఎన్నో నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధికి సహకరించారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ఇప్పుడు 18 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోందని, దీంతో దేశంలోనే రైతులకు 24 గంటల కరెంటును అందించి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

రైతులు మోటారు బోర్ల వద్ద నారు మడులను పోసుకున్నారని, చెరువులు, కాలువల కింద కూడా నారు మడులు పోసుకునేందుకు శుక్రవారమే నిజాంసాగర్ నీటిని వదిలామన్నారు. నారు మడులు పెరిగిన తరువాత కూడా వరినాట్లు వేసుకునేందుకు నీటిని వదులుతామన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో రైతు బంధు కింద 7 వందల కోట్ల రూపాయలను అందించామన్నారు. అదేవిధంగా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు భీమా ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందజేస్తున్నమన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వర్షాకాలంలో 70 వేల ఎకరాలు, యాసంగిలో 55 వేల ఎకరాలలో వరిపంట పండితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రెండు సార్లు కూడా 110వేల ఎకరాలలో వరి పంట పండుతున్నదని ఆయన తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికముగా వరి పండించే నియోజకవర్గం బాన్సువాడ అని గర్వంగా చెప్పారు. ఈ కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు హన్మంత్ రావు పటేల్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, ఆర్డివో రాజగౌడ్, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ బేగరి లక్ష్మి, సోసైటీ చైర్మన్ రామకృష్ణ గౌడ్, నాయకులు పండరి పటేల్, ఇందూరి గంగాధర్, బోయి లాలయ్య, రాంబాబు, కమ్మ సత్యనారాయణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News