అడ్లూరు శివారులోని సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి పాడి గేదెలు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తూ రైతన్నలు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Update: 2023-06-01 12:54 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి పాడి గేదెలు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తూ రైతన్నలు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పంట చేలలోని విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ఉన్నాయని, దీని ద్వారా ఇప్పటికే పలుప్రమాదాలు సంభవించి పాడిపశువులు మృతి చెందాయని, వేలాడుతున్న వైర్లను సరిచేయాలని పలుమార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో గురువారం గ్రామానికి చెందిన మొగుళ్ల సాయా గౌడ్ రెండు పాడి గేదెలు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయన్నారు.

దీంతో అతనికి సుమారు లక్షన్నర వరకు ఆస్తినష్టం సంభవించిందని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అడ్లూరు శివారులోని సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు గంటపాటు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో అటువైపుగా వెళుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిస్థితిని గమనించి రైతుల వద్దకు వెళ్లి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వేలాడుతున్న వైర్లను వెంటనే సరి చేయిస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News