పిప్రి మాజీ ఎంపీటీసీ కుటుంబం గ్రామ బహిష్కరణ

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాయన్న కుటుంబాన్ని ఆ గ్రామానికి చెందిన గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ కార్యవర్గం) బహిష్కరించింది.

Update: 2024-04-06 13:30 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాయన్న కుటుంబాన్ని ఆ గ్రామానికి చెందిన గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ కార్యవర్గం) బహిష్కరించింది. పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బాధితుడు సాయన్న ఇటీవల పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో వ్యవసాయ భూమి విషయంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాయన్న, భూమన్నల మధ్య తగాదా తలెత్తింది. ఈ విషయమై భూమన్న గ్రామాభివృద్ధి కమిటీకి ఫిర్యాదు చేశాడు. భూమి విషయంలో మాజీ ఎంపీటీసీ సాయన్నను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పంచాయతీ నిర్వహించి పిలిపించారు.

    మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాయన్నకు రూ. 2 లక్షలు జరిమానా విధించారు. సాయన్న జరిమానా చెల్లించినా కుల సంఘం మద్దతుతో ఆయన కుటుంబాన్ని రెండు నెలల క్రితం గ్రామ బహిష్కరణ చేశారు. మాజీ ఎంపీటీసీ సాయన్నకు గ్రామ బహిష్కరణ చేయడంతో తనకు గ్రామంలో కిరాణా సామాను, హోటళ్లలో టీ, తాగునీరు సైతం ఇవ్వకపోవడంతో సాంఘిక బహిష్కరణ ద్వారా సాయన్న తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. మాజీ ఎంపీటీసీ సాయన్న తన తప్పు లేకున్నా బహిష్కరణ విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబాన్ని బహిష్కరణ చేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందు వల్ల ఇటీవల ఆర్మూర్ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చిన పిప్రి వీడీసీ సభ్యులు

పిప్రి మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాయన్న కుటుంబానికి బహిష్కరణ చేశారనే ఫిర్యాదు మేరకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లోని పోలీస్ అధికారులతో వీడీసీ సభ్యులు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసులు, పిప్రి వీడీసీ సభ్యుల మధ్య ఏం సంభాషణ జరిగిందనేది పూర్తిస్థాయిలో ఇంకా తెలియలేదు. మాజీ ఎంపీటీసీ పై గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలో ఎవ్వరి సహకారం లేకుండా చేయడం భావ్యం కాదని పోలీస్ అధికారులు వీడీసీ సభ్యులతో మాట్లాడినట్లు తెలిసింది. 


Similar News