విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా కృషి చేయాలి

విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు.

Update: 2024-01-10 12:31 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్ : విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మార్చిలో నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై బుధవారం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

    అదేవిధంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా విద్యా బోధనతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించారు. గతంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడానికి గల కారణాలు అన్వేషిస్తూ, మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు తలచుకుంటే నాణ్యమైన విద్యతోపాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చునని కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో

    విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయులు సర్దుబాటు చేసుకోవాలని కలెక్టర్ డీఈఓ కు సూచించారు. పరీక్షలు పకడ్బందీగా, కఠినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల సమయంలో మండలాల అధికారులను విధుల్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీసీఈబీ చైర్మన్ అనంత రెడ్డి, ఏసీజీఈ రామ్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 


Similar News