పుట్టుకతో మూగ, చెవిటి... అయినా సదరం సర్టిఫికెట్ ఇవ్వని అధికారులు

దేవుడు ఇచ్చిన అవయవాల్లో ఏవైనా లోపం ఉంటే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అందజేసే సదరం సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు.

Update: 2024-01-25 12:12 GMT

దిశ,కామారెడ్డి : దేవుడు ఇచ్చిన అవయవాల్లో ఏవైనా లోపం ఉంటే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అందజేసే సదరం సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించడం లేదు. పుట్టుకతో మూగ, చెవిటి కావడంతో సదరం సర్టిఫికెట్ కోసం తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని...కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని దౌల్తాపూర్ గ్రామానికి చెందిన హనుమండ్లు అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు.

    కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మనవడు అఖిల్ తో కలిసి తాత హనుమాన్లు మాట్లాడారు. తన మనవడు మైలారం అఖిల్ పుట్టుకతోనే మూగ, చెవిటితో పుట్టాడని తెలిపారు. ఇతనికి 2018 సంవత్సరంలో సదరం సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ అది రిజెక్ట్ అని చూపిస్తుందని పేర్కొన్నాడు. మళ్లీ సదరం క్యాంపు కొరకు ఆన్లైన్ చేసుకుందామంటే చూపెట్టడం లేదని, సదరం క్యాంప్ లకు ఎన్నిసార్లు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లమని చెప్తున్నారని, అక్కడికి వెళ్తే సదరం కార్యాలయానికి వెళ్లండని సలహా ఇస్తూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరం క్యాంపు సర్టిఫికెట్ ఇప్పించాలని వేడుకున్నాడు. 


Similar News