MLA Sudarshan Reddy : తాగునీటి సరఫరాను మరింతగా మెరుగుపర్చాలి..

తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపర్చాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా సురక్షిత మంచినీటిని అందించాలని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2024-08-05 17:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపర్చాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా సురక్షిత మంచినీటిని అందించాలని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ పట్టణంలోని వాటర్ ఫిల్టర్ బెడ్, పంప్ హౌస్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని మంచినీటి ట్యాంకులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ లో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని, పంప్ హౌస్ ల పనితీరును, ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులు, వాటర్ పైప్ లైన్ తదితర వాటిని సునిశితంగా తనిఖీ చేశారు. శుద్ధి చేసిన జలాల నాణ్యతను టెస్టింగ్ యంత్రం ద్వారా ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో నీటిని శుద్ధి చేస్తున్నారని, పట్టణంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోందా అని ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నూతన పంప్ హౌస్ తో పాటు, ఆయా ప్రాంతాల్లో ట్యాంకుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సమర్పించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటర్ ట్యాంకులు, పంప్ హౌస్ నిర్మాణాల కోసం ప్రతిపాదించిన స్థలాలను ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించి, అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలున్నందున తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తాగునీటి సరఫరా తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజీలు లేకుండా చూడాలన్నారు. శుద్ధి చేసిన తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ జరపాలని సూచించారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ నీటిని క్లోరినేషన్ జరిపించాలన్నారు. తాగునీటి విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ఈ రాకేష్ వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Tags:    

Similar News