ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్షార్హులు కావద్దు

నిజామాబాద్ జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ తిరుగుతుందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు వదంతులు నమ్మవద్దని చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకొని అనుమానితులపై దాడి చేయరాదని అలాంటి వారిని గుర్తించి పోలీసు వారికి సమాచారం అందించాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగినవార్ అన్నారు.

Update: 2024-02-12 18:00 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ తిరుగుతుందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు వదంతులు నమ్మవద్దని చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకొని అనుమానితులపై దాడి చేయరాదని అలాంటి వారిని గుర్తించి పోలీసు వారికి సమాచారం అందించాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగినవార్ అన్నారు. సోమవారం నగరంలోని కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండున్నర నెలలుగా మూడు చైల్డ్ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని ఆర్మూర్, వన్ టౌన్, నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో వేరువేరు ఇన్సిడెంట్స్ జరగగా ట్రేస్ చేశామని నేరస్తులను అరెస్టు చేశామన్నారు.

ఈ మూడు కేసులలో నేరస్తులు ఎవరు కూడా ఒకరికి ఒకరికి మధ్య సంబంధం లేని వారని, నిజామాబాద్ జిల్లాలో పిల్లలను ఎత్తుకెళ్లే (కిడ్నాప్)గ్యాంగ్ తిరుగుతుందని మూడు కిడ్నాపులు చేసింది ఒకే గ్యాంగ్ అని సోషల్ మీడియాలో భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో, టౌన్‌లలో ఇప్పటివరకు ఇలాంటి 15 సంఘటనలు జరిగాయని, అనుమానితులపై అక్కడి వ్యక్తులు దాడి చేసి తీవ్ర గాయాలు చేయడం జరిగిందని, గాయాల పాలైన వారికి ట్రీట్మెంట్ అందించడం జరిగిందని, విచారణ జరపగా వారు పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాలకు సంబంధించిన అమాయకులని వారు పని చేసుకోవడం కోసం వచ్చిన వారని తేలిందని, వారిని కొట్టి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.

ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు. ఈ 15 సంఘటనలో ఎక్కడ కూడా కిడ్నాప్ కోసం నేరం కోసం వచ్చిన వారు కాదని, వారిపై నేర చరిత్ర లేదని అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే అనుమానించి వారిపై దాడి చేయడం జరిగిందని గుర్తించామని అన్నారు. ఈ 15 కేసులలో అనుమానితుల పై ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవని ఈ సందర్భంగా తెలిపారు.

సోమవారం నగరంలోని గాయత్రి నగర్ లో ఖానాపూర్‌కు చెందిన బర్రెల కాపరి రాజు అనే వ్యక్తి పై అక్కడి ప్రజలు అనుమానంతో దాడి చేయడం జరిగిందని ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగిందని దాడి చేసిన వ్యక్తులలో ఐదుగురిని ఐడెంటి ఫై చేశామని మిగతా వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గ్రామాల్లో ఉన్న వీడీసీలలో సివిల్ పంచాయతీలు, క్రిమినల్ పంచాయతీలు పరిష్కరిస్తూ ఒక వర్గం వారికి మాత్రమే మేలు చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని గ్రామంలో సమస్యలు ఎదురైతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు.

గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ లాంటిది చేసే అధికారం గ్రామాభివృద్ధి కమిటీలకు లేదని అన్నారు. జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లకు కార్యాలయాలకు ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారికి లైసెన్స్ ఉందా లేదా చూసి ఇవ్వాలని అన్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది యువత ఇబ్బందులు పడుతున్నారని, గతంలో వందల్లో కేసులు నమోదయ్యాయని, 50 శాతం మందికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయని అన్నారు. లైసెన్స్ లేని నకిలీ ఏజెంట్ల చేతిలో ప్రజలు మోసపోవద్దని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని వినియోగం, రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో డీసీపీ జయరాం, ప్రొబేషనరీ ట్రైనీ ఐపీఎస్ బి. చైతన్య రెడ్డి పాల్గొన్నారు.


Similar News