సెలైన్ ఎక్కించొద్దు

జ్వరం ఉన్నా లేకున్నా... నార్మల్ చెకప్ కోసం వచ్చే వారికి సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేయవద్దని, అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పంపించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యేమిమా ఆర్ఎంపీ, పీఎంపీలకు సూచించారు.

Update: 2024-08-30 14:48 GMT

దిశ, భిక్కనూరు : జ్వరం ఉన్నా లేకున్నా... నార్మల్ చెకప్ కోసం వచ్చే వారికి సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేయవద్దని, అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పంపించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యేమిమా ఆర్ఎంపీ, పీఎంపీలకు సూచించారు. శుక్రవారం ఆమె భిక్కనూరుతో పాటు రామేశ్వర్ పల్లి గ్రామాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను విజిట్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులలో బెడ్లపై పేషెంట్లను పడుకోబెట్టి సెలైన్ ఎక్కించడం చూసి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మీరు సెలైన్ ఎందుకు ఎక్కిస్తున్నారని, ఆ అవసరం ఎందుకొచ్చిందని ప్రైవేటు వైద్యున్ని ప్రశ్నించగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్హుడైన వైద్యుడి రిఫర్ మేరకే ఇక్కడి పేషెంట్ కు సెలైన్ ఎక్కించానని చెప్పాడు. అలా రిఫర్ చేసినప్పుడు ఆ డాక్టర్ పేరున ప్రిస్క్రిప్షన్ ఉండాలి కదా అని ప్రశ్నించారు. దీంతో ప్రైవేటు వైద్యుడు సదర్ డాక్టర్ తో మాట్లాడగా తానే సెలైన్ పెట్టుమన్నానని చెప్పాడు.

    దీంతో మెడికల్ షాప్ ను తనిఖీ చేసి లైసెన్స్ హోల్డర్ గురించి వాకబ్ చేశారు. మరో ప్రైవేటు ఆసుపత్రిని విజిట్ చేయగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో గదిలోని డస్ట్ బిన్ లో ఖాళీ గా పడి ఉన్న సెలైన్ బాటిళ్ల ను చూసి విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఈ ప్రైవేటు ఆస్పత్రులను విజిట్ చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వచ్చేవారికి నార్మల్ ట్రీట్మెంట్ చేసి పంపాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేయరాదన్నారు. తాము విజిట్ చేసిన ఆసుపత్రిల నిర్వహణపై రిపోర్ట్ తయారుచేసి, పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపించనున్నట్లు వివరించారు. మెడికల్ ఆఫీసర్ తనిఖీ చేస్తున్న విషయం తెలిసి చాలామంది ఆర్ఎంపీ, పిఎంపీలు తమ ఆసుపత్రులను మూసి వేసుకున్నారు. రాజంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య పరిధిలోకి వచ్చే జంగంపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో నడుపుతున్న మూడింటిని సీజ్ చేశారు. ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని సర్వరోగనివారిని మాత్రలు ఇవ్వకూడదని, సెలైన్ అసలే ఎక్కించరాదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రాజంపేట ప్రాథమిక వైద్యాధికారిని విజయ మహాలక్ష్మి, సూపర్వైజర్లు మంజూర్, గంగామణి, వినోద, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News