పురాతన నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్...

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.

Update: 2024-06-27 17:24 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. నాలుగు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టడం ద్వారా బావిలో వర్షపు నీరు నిలిచి సమీపంలోని బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. పునరుద్ధరణ చేసిన తీరును స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కలెక్టర్ కు వివరించారు.

అనంతరం లింగంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను కలెక్టర్ పరిశీలించారు. స్లాబు మరమ్మత్తులు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వండే విధానాన్ని చూశారు. రుచికరమైన వంటలు ఉండాలని ఉండాలని ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. వారికి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను, మందులు, సిబ్బంది వివరాలను జిల్లా ఉపవైద్యాధికారి శోభా రాణిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయని, వాటిని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా మార్చాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ సురేందర్, ఎంపీపీ గరీబున్నిసా, ఎంపీడీవో నరేష్, మండల విద్యాధికారి రామస్వామి, పంచాయతీ రాజ్ ఎఈ రాకేష్, వైద్యాధికారిని హిమబిందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News