జోరుగా ఫిల్టర్ ఇసుక రవాణా..అడ్డూ...అదుపేది..?

కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఇసుక అక్రమ రవాణా

Update: 2024-10-22 02:28 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. కామారెడ్డి మండల పరిధి లోని గూడెం, క్యాసంపల్లి గ్రామాల్లో గల ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. గూడెం గ్రామంలో 50 శాతానికి పైగా ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయి. అయితే ఆ భూములే వారికి బంగారు బాతు గా మారింది. రైతులు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతారని ప్రభుత్వం భావించగా దానికి తూట్లు పొడిచి అడ్డదారుల్లో ఆ భూములను తవ్వుతూ మట్టిని ట్రాక్టర్ లలో నింపి తీసుకుపోయి దానిని నీటితో ఫిల్టర్ చేసి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తరలించి అమాయక ప్రజలకు విక్రయిస్తూ నట్టేట ముంచుతున్నారు.

నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం...

పేద రైతులు వ్యవసాయం చేసుకుని జీవించడానికి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇవ్వగా ఇసుక వ్యాపారులు మాత్రం వ్యవసాయానికి బదులు ఆ భూముల్లో నుంచి మట్టిని తవ్వి దానిని ఫిల్టర్ చేసి యథేచ్ఛగా రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అయినా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదో అర్ధరాత్రి వేళలో ఈ దందా గుట్టుగా సాగడం లేదని, యథేచ్ఛగా పట్టపగలే వ్యవసాయ బోర్ల వద్ద ఫిల్టర్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక వ్యాపారులు సిండికేట్ గా మారి అధికారులను మచ్చిక చేసుకుంటూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అబాసు పాలవుతున్న ఉచిత విద్యుత్..

ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తుంటే దానిని ఇసుక వ్యాపారులు అడ్డదారుల్లో మట్టిని ఫిల్టర్ చేయడానికి వాడుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తీసుకువచ్చి తమ వ్యవసాయ బోరు బావుల వద్ద నీటితో మట్టిని ఫిల్టర్ చేస్తూ ఇసుకను తయారు చేస్తున్నారు. అయినా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఈ వ్యవహారం కనిపించకపోవడం శోచనీయం. గతంలో ఒకసారి విద్యుత్ అధికారులు ఫిల్టర్ చేసే బోరుబావుల పై దాడులు నిర్వహించి స్టార్టర్ డబ్బాలను తీసుకువచ్చారు. అయితే వారితో సంబంధిత ఇసుక వ్యాపారులు బేరం కుదుర్చుకుని తీసుకువెళ్లిన డబ్బాలను తిరిగి వాపస్ తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇసుక వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేస్తాం.. : జనార్ధన్, తహశీల్దార్

ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టిని తరలించి ఫిల్టర్ చేసి ఇసుకగా మార్చే ట్రాక్టర్లను పోలీసుల సహకారంతో సీజ్ చేస్తాం. గతంలో వారికి చాలా సార్లు చెప్పాం... అయినా వారి పద్ధతి మారడం లేదు.


Similar News