రేవంత్ రెడ్డి సోదరుడుని అరెస్ట్ చేయాలని పోలింగ్ బూత్ ఎదుట ధర్నా..

Update: 2023-11-30 06:35 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికేతర్లెవరు ఈనెల 28 నుంచి స్థానికంగా ఉండరాదనే నిబంధనలో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలింగ్ బూత్‌లలోకి నేరుగా చొచ్చుకు వెళుతున్నాడని ఆరోపించారు.


కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌తో పాటు బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ బూతులోకి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతనికి ఎన్నికల నిబంధనలు ఉండవా అని అన్నారు. వెంటనే కొండల్ రెడ్డిని అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాలరావు తో పాటు స్థానిక కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. నల్ల కార్ల కాన్వాయ్‌తో పోలింగ్ బూతుల్లో హల్‌చల్ చేస్తున్నా చోద్యం చూస్తున్న ఎలక్షన్ అధికారులు, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. కొండల్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గోనె శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక కొండలరెడ్డి పీఏ ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News