గోవింద్ పెట్ లో మొక్కజొన్న పంట ధ్వంసం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో మొక్కజొన్న పంటను మంగళవారం రాత్రి ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు.

Update: 2024-12-24 16:40 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో మొక్కజొన్న పంటను మంగళవారం రాత్రి ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..గోవింద్ పెట్ గ్రామంలో అంతిరెడ్డి అలేఖ్య అనే మహిళ రైతు రెండున్నర ఎకరాలలో మొక్కజొన్న పంట పండిస్తుంది. మొక్కజొన్న పంట పండించడాన్ని గిట్టని మామ అంతిరెడ్డి నరసయ్య, తోటి కోడలు విజయ కలిసి కుట్రపూరితంగా ట్రాక్టర్ తో మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు. రెండు ఎకరాలలో వరి సాగు చేయడానికి వేసిన వరి నారును కాళ్లతో తొక్కేశారు. డ్రిప్ పరికరాలు,పైప్ లైన్లను పగలగొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. బోరు మోటర్ ను ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి సైతం విద్యుత్ లైన్ బంద్ చేసి బోరు మోటర్,స్టార్టర్లు, ఫీజు వైర్లను ఎత్తుకెళ్లారు. డ్రిప్ పైపులను దగ్ధం చేశారు. శనివారం రాత్రి మామ,తోటి కోడలు కొందరితో కలిసి కక్షగట్టి ధ్వంసం చేసినట్లు అలేఖ్య తెలిపారు. మూడు రోజులలో రెండుసార్లు మొక్కజొన్న పంటలో పైప్ లైన్లు, డ్రిప్ పరికరాలు ధ్వంసం చేయడంతో..సుమారు 6 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. మరిది భార్య విజయ తన ఇద్దరు పిల్లలకు ఫోన్ చేసి మీ అమ్మను చంపివేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. మామ తనను చంపడానికి ప్రయత్నించారన్నారు . రెండున్నర ఎకరాలలో పండిస్తున్న మొక్కజొన్న పంటను,పరికరాలను ధ్వంసం చేయడంతో బాధితురాలు అలేఖ్య కన్నిటి పర్యంతమయ్యారు. మొక్కజొన్న పంటను, పరికరాలను విద్యుత్ కు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసిన మామ నరసయ్య, తోటి కోడలు విజయలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు అలేఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Similar News