BRS Party : బీఆర్ఎస్ లో నయాజోష్..
నిన్న మొన్నటి వరకు.. పార్టీలో నెలకొన్న గ్రూపులతో సతమతమైన నేతలు... సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో బీఆర్ఎస్ పార్టీ సీను పూర్తిగా మారిపోయింది.
దిశ, భిక్కనూరు : నిన్న మొన్నటి వరకు.. పార్టీలో నెలకొన్న గ్రూపులతో సతమతమైన నేతలు... సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో బీఆర్ఎస్ పార్టీ సీను పూర్తిగా మారిపోయింది. కొందరు పార్టీ నాయకుల తీరువల్ల, అంతర్గతంగా అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు సైతం పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఉత్సాహంగా హాజరవుతున్నారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్ డైరెక్షన్ మేరకు వర్చువల్ గా ప్రారంభించిన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం వెనక, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం, పార్టీ నుంచి పిలుపు వచ్చిందన్న ఉత్సాహంతో ఉన్న నేతలు తమ ద్విచక్ర వాహనాల పై శ్రేణులను ఎక్కించుకొని పార్టీ కండువాలు మెడలో వేసుకొని హుషారుగా జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఇకనుంచి అందరికీ సమాచారం చేరవేయాలని నేతలు నిర్ణయించారు. ఎవరు నారాజ్ కాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తూ... ప్రత్యర్థి పార్టీలకు గుబులు పుట్టించే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
చేరికల పై ఫోకస్..
వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులను బీఆర్ఎస్ లో చేర్చుకునే విధంగా నేతలు ఫోకస్ పెట్టారు. వివిధ పార్టీలలో ఉన్న ప్రముఖులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే విధంగా పక్కాప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది చేరికలను పెంచే విధంగా ముందుకు కదులుతున్నారు. సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించే విధంగా పార్టీ అధిష్టానం భారీ స్కెచ్ వేసింది. ఆయా పార్టీలలో ఉన్న ప్రముఖ నేతలు ద్వితీయ శ్రేణి నాయకులనే కాకుండా, ఇంతవరకు రాజకీయంలో తిరగని తటస్తులు, వ్యాపారులు మంచి పేరు పలుకుబడి ఉన్న వారిని సైతం పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహం రూపొందిస్తున్నారు. మున్ముందు పార్టీలో అనేక మార్పులు చేర్పులు ఉంటాయనికూడా పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
ఆలయాలకు మహర్దశ...
అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలకు మహర్దశ రానుంది. నియోజకవర్గంలోని ఈ రెండు దేవాలయాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ రెండు ప్రముఖ దేవాలయాలే కాకుండా, నియోజకవర్గంలో ఉన్నవివిధ దేవాలయాలను సైతం అభివృద్ధిపరిచే విధంగా ప్లాన్ తయారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేయడం వలన నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయన్న ఆశాభావాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.