మలుపు అంచున పొంచి ఉన్న ప్రమాదం

అమీర్ నగర్ నుంచి డీసీ తాండ మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న బావి వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది.

Update: 2024-12-29 17:36 GMT

దిశ ,కమ్మర్ పల్లి: అమీర్ నగర్ నుంచి డీసీ తాండ మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న బావి వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ వడ్డెర కాలనీ నుంచి డీసీ తాండ వెళ్లే దారిలో రోడ్డుపక్కన ఉన్న పెద్ద బావి ప్రమాదకరంగా ఉంది. అసలే మూలమలుపుతో కూడిన ప్రాంతంలో రోడ్డుకు అంచున 20 అడుగులపైగా లోతైన పాడుబడ్డ బావి కారణంగా ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వాహనాదారులు భయపడుతున్నారు.చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో అక్కడ బావి ఉన్నట్లు తెలియక వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై కనీసం ప్రమాద సూచికలైనా పెట్టకపోవడం పట్ల జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర మూలమలుపుతో కూడిన రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణం దిన దినం గండంగా మారుతుందని జనాలు వాపోతున్నారు. రోడ్డుపై పడిన గుంతలు రోజులు తరబడి నిర్లక్ష్యంగా వదిలేయడం కూడా ప్రమాదాలకు దారి తీసిన సంఘటనలు ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం వందలాది వాహనాలు వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావి చుట్టు రక్షణ గోడ లేనిపక్షంలో ఫెన్సింగ్ అయిన ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News