ఎంపీ కవిత నిజామాబాద్ నగరానికి చేసిందేమీ లేదు

నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్, నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు.

Update: 2025-01-01 14:47 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 01: నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్, నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశ వేణు ఈ విషయాలను వెల్లడించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా అర్బన్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం రూ.60 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా అమృత్ స్కీం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు రూ. 400 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం పూర్తి చేసిందని కేశ వేణు అన్నారు. కానీ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తిచేయలేదని కేశ వేణు అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నిజామాబాద్ కు చుట్టపు చూపుగా వచ్చిన ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడుతున్నారని కేశ వేణు విమర్శించారు.

గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని, కేవలం ముఖ్యమంత్రి కూతురు హోదాను మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేసిందని కేశ వేణు ఎద్దేవా చేశారు. ప్రజల గురించి కానీ, నిజామాబాద్ నగరాభివృద్ధి గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడిందని, అప్పుడు ఎంపీగా ఉన్న కవిత ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదన్నారు. మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, పేదలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్లు కరెంటు, రుణమాఫీ వంటి హామీలన్నీ పూర్తిగా అమలయ్యాయన్నారు. మరో సారి వాటిపైనా, ప్రభుత్వం పైనా ఎమ్మెల్సీ కవిత మరోసారి అబద్దపు మాటలు మాట్లాడితే మహిళా కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతారని కేశ వేణు హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావేద్ అక్రమ్,కార్పొరేటర్ ఖుద్దూస్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,కార్పొరేటర్ రోహిత్,బీసీ సెల్ నగర అధ్యక్షులు నాగరాజు,ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వినయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, లవంగ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మ,అపర్ణ, శుభం, అయూబ్,ఆకుల మహేందర్, సాయి కుమార్, హరూల్ ఖాన్, వలీ తదితరులు పాల్గొన్నారు.


Similar News