పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన తన నియోజకవర్గ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, పంటలను పరిశీలించారు. అనంతరం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ పరిస్థితులపై రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల నియోజక వర్గం పరిధిలోని పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పంట నష్టంపై వ్యవసాయ అధికారులు వివరించారు. మెండోరా మండలం బుస్సాపూర్ లో సుమారు 40 ఎకరాల్లో గ్రౌండ్ నట్ పంట, వేల్పూర్ మండలం మోతెలో 10 ఎకరాల్లో వరి, పచ్చలనడుకుడలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. పంట నష్టంపై సత్వరమే ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో మళ్లీ వర్షాలు కురిస్తే పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మొండి వాగులో గల్లంతై చనిపోయిన కామారెడ్డికి చెందిన రైతు కూలీ వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇంకా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్మూర్ ఆర్డీ ఓ రాజగౌడ్, ఏడీఏ శ్రీనివాసరాజుతో పాటు 8 మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్ డీఈ సురేష్, ఏఈ లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.