ఆ పార్టీల డిక్లరేషన్ చూస్తే నవ్వొస్తుంది : కల్వకుంట్ల కవిత
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులు, దళితుల పై కాంగ్రెస్, బీజేపీలు కపట ప్రేమ చూపుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
దిశ, కామారెడ్డి : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులు, దళితుల పై కాంగ్రెస్, బీజేపీలు కపట ప్రేమ చూపుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దళిత డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్, రైతు భరోసా పేరుతో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే సభలు పెడుతున్నారన్నారు. దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ దళితులను గరీబుల మాదిరిగా కిందనే ఉంచింది కానీ పైకి తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసమా సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెగిసుకొచ్చారన్నారు. ఇక్కడి నాయకులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఖర్గేను రప్పించారని తెలిపారు. వాళ్ళ ఏజండా చూస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలనే అర్రాస్ పాడినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం దళితులకు 10 లక్షలిస్తే వాళ్ళు 12 లక్షలిస్తామని, 2 వేల పింఛన్ ఇస్తుంటే నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ భావ దారిద్య్రం తప్పితే భావోద్వేగం, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, తెలంగాణను ఉద్ధరించాలన్న ఆలోచన లేదన్నారు. కేవలం రాజకీయం తప్ప మరే ఆలోచన లేని విషయాన్ని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా దళితుల కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఒక వ్యక్తి సగటు ఆదాయం చూస్తారని, తెలంగాణ వచ్చాక ఒక వ్యక్తి సగటు ఆదాయం డబుల్ అయిందని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థాయిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఖర్గేకు అధ్యక్ష పదవి ఇవ్వడం తప్ప దళితులకు చేసిందేమీ లేదన్నారు. అన్ని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణాలో డా.అంబెడ్కర్ పేరుమీద ఇస్తున్న స్కాలర్ షిప్ విషయాన్ని మాత్రం చెప్పలేదన్నారు.
ఇక్కడ అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తిప్పి చెప్తూ ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయిన వారికి ఇస్తామని చెప్తున్నారు తప్ప అందులో నిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేసిన పార్టీ కాదన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెల రోజుల్లోనే అక్కడి సీఎం సిద్దిరామయ్య ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, హామీలను అమలు చేయలేమని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బాగుచేసే శక్తి లేనప్పుడు వాగ్దానాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దళిత డిక్లరేషన్ పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నామని, దానిని ప్రజలు నమ్మవద్దని కోరారు. అమిత్ షా వచ్చి రైతుల గురించి మాట్లాడటం హాంతకుడే వచ్చి నివాళులర్పించినట్టు ఉందన్నారు.
మూడు నల్లచట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణం బీజేపీ అన్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా ఉన్నమోటర్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందని, వాటికి మీటర్లు పెట్టాలని బీజేపీ చెప్తుందన్నారు. రైతులకు 25వేల కోట్ల నష్టాన్ని తీసుకుని మీటర్లకు మోటర్లు పెట్టేది లేదని చెప్పామన్నారు. అలాంటి బీజేపీ ఏం ముఖం పెట్టుకుని రైతు డిక్లరేషన్ చేసిందో ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని కాపీకొట్టి 13 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6 వేలు మూడు విడతలుగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం దానికి నేడు రెండున్నర కోట్ల మందికి ఇస్తుందన్నారు. తెలంగాణాలో రైతుబంధు ఇస్తున్నామని, రైతు భీమా అమలు చేస్తున్నామని వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నామన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదన్నారు. తమ పార్టీ తరపున కేసీఆర్ సీఎం అభ్యర్థిగా బాజాప్త చెప్పుకుంటున్నామని, ఆ రెండు పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేక కన్ఫ్యూజన్ లో, ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ చేతిలో నాలుగు సార్లు ఓటమి పాలయ్యారని, అటువంటి వ్యక్తిని ఓడించేందుకు సీఎం కేసీఆర్ పోటీ చేసేంత సీన్ షబ్బీర్ ఆలీకి లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబొద్దిన్ పాల్గొన్నారు.
గంపకు రాఖీ కట్టిన కవిత
మీడియా సమావేశానికి ముందు ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. రాఖీ పండగ వస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ఎమ్మెల్సీ రాఖీ కట్టారు. అలాగే బ్రహ్మకుమారీలు సైతం విప్ గంప గోవర్ధన్ కు రాఖీ కట్టారు.