ఎకరానికి 15వేలు ఆర్ధిక సహాయం ప్రకటించిన కాంగ్రెస్..
నిజామాబాద్ జిల్లాలో హాత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భీంగల్ మండలంలోని లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం దర్శించుకున్నారు.
దిశ, కమ్మర్ పల్లి : నిజామాబాద్ జిల్లాలో హాథ్ సే హథ్ జోడో పాదయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భీంగల్ మండలంలోని లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం కమ్మర్పల్లి మండల కేంద్రంలో వేలాదిమంది రైతులతో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు.. రైతుకు వ్యవసాయంలో నష్టం జరగడం వలన, ప్రభుత్వాలు ఆదుకోలేకపోనందున అప్పుల పాలైన రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు.
అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతులకు, అలాగే కౌలు రైతులకు కూడా ఎకరానికి 15 వేలు రూపాయలు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుందని అన్నారు. భూమిలేని ఉపాధి హామీల కూలీలకు, ఉపాధి వెళ్లే ప్రతి కుటుంబానికి 12 వేలు రూపాయలను ఇస్తామని అన్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తెరిపిస్తామని ఆయన అన్నారు. పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతోని, వర్షాలతోని, కరువుతోని, ఇతర కారణాల చేత ఏదైనా పంట నష్టం వస్తే తక్షణమే రైతులను ఆదుకోవడానికి పంట బీమా పథకాన్ని అమలు చేసి మీ పెట్టుబడిని మొత్తాన్ని పంటల బీమా రూపంలో మీకు తిరిగి చెల్లించే విధంగా పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
రైతు బీమా కంటే పంటల బీమా పథకం అత్యంత కీలకమైనదని అన్నారు. రైతు పెట్టిన పెట్టుబడి ఏ కారణం చేత అయినా నష్టం జరిగితే రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలన్న, రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలన్న, పంటల బీమా పథకం పగడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. పెట్టిన పెట్టుబడులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను బ్రతికించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మనం చనిపోతే మాత్రం ఐదు లక్షల రూపాయలు వెలకడుతుందని, మనం బ్రతికి ఉన్నప్పుడు మనకి సహాయం అందించని ప్రభుత్వం మన చావుకి మన శవానికి ఐదు లక్షలు వెల కడుతుందని మండిపడ్డారు. రైతులకు పసుపు,ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు.
దేశ సొత్తును మోడీ దోచి పెడుతున్నారని మండిపడ్డారు.హర్యానా పంజాబ్ రైతుల లాగా నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉందని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయాడని అన్నారు.ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని అన్నారు.పేదవారికి మంచి కార్పోరేట్ వైద్యాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు.
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కుటుంబాలను ఆదుకోవడానికి 500 రూపాయలకే సిలిండర్ ను మీఇంటికి తీసుకువచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని 12 వేల రూపాయలకు పసుపు కొనుగోలు చేస్తామని అన్నారు. అదేవిధంగా మక్కలు 2200, మిర్చి 15000, పత్తి 6500, కందులు 6,700, చెరుకు 4000, సోయా 4400, ఎర్ర జొన్నలు 3500, వరి 2500 రూపాయలకు కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కార్యక్రమం లో డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.