ఇంటర్, ఎస్సేస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2023-03-03 09:33 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని సూచించారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి లేదని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. జిల్లాలో 38 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 7495 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 6253 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు.

జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 11,899 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఐదుగురిని రూట్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. 22 మంది కస్టూడియన్స్, 15 మందిని సి సెంటర్ కస్టూడియన్స్ గా నియమించినట్లు చెప్పారు. 595 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, పోస్టల్, పోలీస్ శాఖలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు లింగం, అజ్మల్ ఖాన్, నిజం, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News